నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీ కమిషనర్ పోస్టు.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దశాబ్ద కాలంలో 20మందికి పైగా కమిషనర్‌లు మారారు. వచ్చిన వారు చాలావరకు తరచు లాంగ్‌లీవ్‌లు ఎందుకు పెడుతున్నారో అంతుచిక్కడం లేదు. అయితే అధికారులు స్వతంత్రంగా, రాజకీయాలకతీతంగా వ్యవహరించకపోవడం ఓ కారణంగా తెలుస్తోంది. దీనికితోడు స్థానికంగా ఉండే కీలకమైన ప్రజా ప్రతినిధులతోపాటు ఆయా పార్టీలలో ఉన్న ముఖ్య నాయకులను గమనంలోకి తీసుకోకుండా ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కొంతమంది రాజకీయ నాయకుల వ్యవహారశైలి, అధికారుల అత్యుత్సాహం ఇందుకు తోడవుతోంది. ఇక్కడ పనిచేయాలంటే కత్తి మీద సామే అనే స్థాయికి ప్రచారం తీసుకువచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే మున్సిపాలిటీలో ఉద్యోగంలోకి ఎక్కి ఇక్కడే రిటైర్డ్ అయిన వారు సైతం ఉన్నారు. కమిషనర్ లేని సమయంలో ఇన్‌చార్జ్‌ల పాలనలోనూ దాదాపు ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఉద్యోగులు కూడ అవకాశాలను బట్టి నాయకుల రాజకీయ నాయకుల చంకన చేరడం, నాయకులు సైతం వారిని వెనకేసుకురావడం ఇక్కడి మున్సిపాలిటీలో సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది.
ఆగిన ఫైల్స్ ...
ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌కుమార్ గత మే నెలలో బాధ్యతలు స్వీకరించారు. గత నెల 7వ తేదీనుంచి 28వ తేదీ వరకు సెలవులో పెట్టారు. దానిని నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించుకున్నారు. విధుల్లో చేరిన ఆయన కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ సెలవుపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ ఈనెల 10వ తేదీ వరకు సెలవు పెట్టుకున్నా..తన సెలవును పొడిగించుకునే అవకాశం ఉంది. ఆయన డిజిటల్ సంతకం కూడా ఇంకా మారలేదు. వారం రోజులుగా కమిషనర్ లేక అనేక ఫైల్స్ ఆగిపోతున్నాయి. సంతకాల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం కమిషనర్ లేకపోవడం, ఎవరికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించకపోవడంతో పాలనకు అంతరాయం కలుగుతోంది.
మున్సిపాలిటీ చుట్టూ రాజకీయాలు ...
కొంతకాలంగా నీలగిరి మున్సిపాలిటీ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఇక్కడే ఉండడంతో మున్సిపాలిటీపై ఆధిపత్యంలో తమదే పైచేయిగా ఉండాలనే తాపత్రయం దశాబ్ధం నుంచి నడుస్తుంది. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం వారు మున్సిపాలిటీ రాజకీయాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలో ఎవరి పార్టీ అధికారంలో ఉంటే వారికి నచ్చిన అధికారులను ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. దాంతో అధికారులు కూడా ఆదే పార్టీ వారికి కొంత సానుకూలంగా ఉండడం, వారి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలాంటి సమస్యల తలెత్తి వివాదాస్పదంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య రగడ జరగడం, ఉద్యోగుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు వెళ్లడం తదితర కారణాలతో ఇక్కడికి వస్తున్న కమిషనర్‌లు ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment