
కళాశాల భవనంపై నుంచి దూకి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆనం రమ్యారెడ్డి(18) తాను చదువుతున్న కళాశాల భవనం పైఅంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం శనివారం ఖమ్మంలో కలకలం సృష్టించింది.
ఖమ్మం: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆనం రమ్యారెడ్డి(18) తాను చదువుతున్న కళాశాల భవనం పైఅంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం శనివారం ఖమ్మంలో కలకలం సృష్టించింది. కళాశాల విద్యార్థులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం...జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆనం వెంకటరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె రమ్యారెడ్డి ఖమ్మం నగరంలోని నవీనా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ (సీఈసీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం కళాశాలకు వచ్చిన రమ్య మధ్యాహ్నం తరువాత మూడీగా ఉందని తోటి విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత క్లాస్‌రూమ్ నుంచి బయటకు వెళ్లింది.
నేరుగా కళాశాల భవనం నాల్గో అంతస్తు పైకి వెళ్లి అక్కడే చెప్పులు విప్పి కిందకు దూకింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సహచర విద్యార్థులు, కళాశాల యాజమాన్యం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గంమధ్యలో మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థిని మృతి విషయం తెలుసి ఆర్జేసీ విద్యాసంస్థల చైర్మన్ కృష్ణ, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మృతదేహాన్ని సందర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చారు.
మిన్నంటిన ఆందోళనలు...
విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసిన వెంటనే ఐద్వా, పీవోడబ్ల్యూ మహిళా సంఘాలు, పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు, జిల్లా ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. రమ్యారెడ్డికి మృతి కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన ఇంటర్ ప్రాంతీయ అధికారి(ఆర్‌ఐవో) ఆండ్రోస్‌ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ రమణమూర్తి, ఎస్‌ఐలు కరుణాకర్, భానుప్రకాష్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్‌ఐవో ఆండ్రోస్ మాట్లాడుతూ విద్యార్థిని మృతి విషయం ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. మధీనా కళాశాలను పేరు మార్చి నవీనా కళాశాలగా నిర్వహిస్తున్నారని, పేరుమార్పిడి కోసం ధరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పోలీసుల విచారణలో కళాశాల యాజమాన్యం తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న శవం ఎదుట విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఖమ్మం నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల సీఐలు రమణమూర్తి, సాధుల సారంగపాణి, తిరుపతిరెడ్డి, అంజలితోపాటు ఎస్సైలు, పోలీసుసిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు మృతదేహాన్ని మార్చరీకి తరలించారు.
ఎన్నెన్నో అనుమానులు...
రమ్యారెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాల్గో అంతస్తు పైనుంచి దూకితే తలకు తప్ప మరెక్కడా గాయాలు కాకపోవడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకటి, రెండురోజుల్లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు వస్తాయని తెలిసినప్పటి నుంచి రమ్య మూడీగా ఉంటోందని తోటి విద్యార్థులు చెప్పారు. పరీక్షల్లో తప్పుతానే భయంతోనే ఆత్మహత్య చేసుకుందా..? లేక మరేమైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.