
మెదక్‌లో ఐపీఎల్ బెట్టింగ్ ఫీవర్
ఐపీఎల్ 20 - 20 క్రికెట్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో మెదక్ పట్టణంలో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి.
- కాయ్ రాజ కాయ్
- ఐపీఎల్‌లో లక్షలు మారుతున్న చేతులు
- వ్యసన పరులై నష్టపోతున్న యువత
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : ఐపీఎల్ 20 - 20 క్రికెట్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో మెదక్ పట్టణంలో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. కేవలం గంటల వ్యవధిలోని కొందరు రూ. లక్షలు సంపాదిస్తుండ గా.. మరికొందరు రూ. లక్షలు పోగొట్టుకుం టున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్‌ల సంస్కృతి ప్రస్తుతం పల్లెలకూ పాకింది.
ఏప్రిల్ 16న దుబాయ్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెలాఖరుతో ముగుస్తున్నాయి. దీంతో రూ.10 నుంచి మొదలుకుని రూ.లక్ష వరకు పందేలు కాస్తున్నారు. మెదక్ పట్టణంలోని నర్స్‌ఖేడ్, పిట్లంబేస్, ఫతేనగర్, అజంపురా, పిల్‌దిడ్డి, పెద్దబజార్, వెంకట్రావ్‌నగర్ కాలనీలతో పా టు పట్టణ చుట్టుపక్క పల్లెల్లో సైతం ఐపీఎల్ 20 - 20 బెట్టింగ్‌లు కాస్తున్నారు. సాయంత్రం కేవలం రెండు గంటల్లో ఫలితం వస్తుండటంతో చాలా మంది యువత ఉదయం పనులు వెళ్లి అందులో వచ్చే ఆదాయంతో బెట్టింగ్‌ల్లో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ విన్ ఎవరవుతారు? విన్ అయితే బ్యాటింగా? బౌలింగా? పది ఓవర్ల మ్యాచ్ తరువాత ఎంత స్కోర్ వస్తుందా? సెకండ్ ఇన్నింగ్ దిగిన జట్టు గెలుస్తుందా? ఓడుతుందా? ఎవరు సిక్సర్లు కొడతారు? వికెట్లు పడగొట్టేదెవరు? మ్యాన్ ఆఫ్ ది ఎవరు? అంటూ పందేలు కాస్తున్నారు. మరికొందరు అయితే ఓవర్ టు ఓవర్ బెట్టింగ్‌లు కాస్తున్నారు. అయితే ఒక ఓవర్‌లో ప్రతి బంతికీ పందేలు కాస్తున్నారు.
నాలుగు జట్లపై భారీగా బెట్టింగ్‌లు
ముఖ్యంగా ఎలిమినేట్ మ్యాచ్‌లో ఎవరు బరిలో ఉంటారన్న విషయంలో పందేలు రూ. లక్షల్లో సాగాయి. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ - కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. పల్లెల్లో హోటళ్లలో కూర్చొని యువకులు క్రికెట్ చూస్తూ పందాలు కాస్తున్నారు. పట్టణాల్లో అయితే సెల్‌ఫోన్, ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. మరోవైపు మ్యాచ్‌ల కోసం యువత రూంలు అద్దెకు తీసుకుని అందులో టీవీలు ఉంచి బంగారు ఆభరణాలు, బైక్‌లపై పందేలు కాస్తున్నారు.