
'సబ్‌ప్లాన్ నిధులు పెంచాలి'
- వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సంక్షేమానికి ఉపయోగపడే సబ్‌ప్లాన్ పద్ధతిని కొనసాగిస్తూనే, దానికి నిధులను పెంచి, ఖర్చు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ప్రభుతానికి సూచించారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవన్నారు. కొత్త పింఛన్లు ఇవ్వటంతోపాటు ఇప్పటివరకు అమలులో ఉన్న పాత పింఛన్లను కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని వికలాంగులకు పింఛన్లు ఇవ్వటం లేదని, సదరమ్ క్యాంపుల సంఖ్య పెంచి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆధార్ కార్డులో వయసు తప్పుగా పడిందని కొన్ని వృద్ధాప్య పింఛన్లను నిలిపివేశారని, ఓటర్ కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న వయసు ఆధారంగా వాటిని కొనసాగించాలని కోరారు. పోడు వ్యవసాయంలో ఉన్న వారికి భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని, అవి లేనికారణంగా అధికారులు వేధిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లేవి? : సీపీఐ
కాగా, రెండు పడక గదుల ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతి పదికన నిధులివ్వాలని, వికలాం గులకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఎస్సీల కోసం రూ.16 వేల కోట్లు, ఎస్టీలకు రూ.10 వేల కోట్లు అవసరమ న్నారు. మైనారిటీలుగా ఉన్న ఆంగ్లో ఇండియన్ వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోరారు. ఇళ్లకోసం వారికి కొంతస్థలం కేటాయించాలన్నారు.