సీసీ'ఠీవి'గా ట్రాఫిక్‌.. | ITMS Trial run was started and Huge Changes Will Be In City traffic system | Sakshi
Sakshi News home page

సీసీ'ఠీవి'గా ట్రాఫిక్‌..

Published Wed, Feb 13 2019 3:35 AM | Last Updated on Wed, Feb 13 2019 3:35 AM

ITMS Trial run was started and Huge Changes Will Be In City traffic system - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం.. స్వైర ‘విహారం’చేసే నేరగాళ్లకు చెక్‌ చెప్పడం.. వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ట్రాఫిక్‌ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌) ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. జూన్‌ వరకు ఈ వ్యవస్థ నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, తలెత్తే సాంకేతిక సమస్యల్ని అధ్యయనం చేయాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. వాటన్నింటినీ సరిచేయడంతో పాటు సమర్థవంతంగా అభివృద్ధి చేసి రాష్ట్రావతరణ రోజైన జూన్‌ 2 నుంచి పూర్తిస్థాయిలో అధికారికంగా అమల్లోకి తీసుకురావడానికి నగర ట్రాఫిక్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నగరంలోని 3 పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో తొలి దశలో ఈ వ్యవస్థ అమలుకానుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్‌ కేంద్రంగా పనిచేసే ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీసీసీసీ) నుంచే జరగనుంది. రాత్రి వేళల్లోనూ పనిచేసే 16 మెగాపిక్సల్‌ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తున్న ఐటీఎంఎస్‌లో ఉండే కీలకాంశాలివి.. 

వాహన మార్గంపై నిఘా.. 
నగరవ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్‌ విధానం ఐటీఎంఎస్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో తిరిగే ప్రతి వాహనాన్నీ నంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. దీంతో ఓ వాహనం నగర పరిధిలో ఎక్కడెక్కడ తిరిగిందన్న వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనాన్ని గుర్తించి.. సత్వర చర్యలకు ఇది దోహదం చేస్తుంది. 

బస్సుల వివరాలూ.. 
సిటీలో సంచరిస్తున్న ఆర్టీసీ బస్సులు ఓ క్రమపద్ధతిలో సాగవు. ఒకే మార్గంలో వెళ్లే అనేక బస్సులు ఏకకాలంలో బస్టాప్స్‌ వద్దకు చేరుకుంటుంటాయి. దీనివల్ల ఆయా బస్టాప్‌లతోపాటు అవి వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్‌ జామ్స్‌ తప్పవు. దీనికి విరుగుడుగా అమల్లోకి రానున్నదే డైనమిక్‌ బస్‌ ప్లాట్‌ఫాం అసైన్‌మెంట్‌ (డీబీపీఏ) వ్యవస్థ. ఒకే మార్గంలో వెళ్లే అనేక బస్సులు ఒకే స్టాప్‌ దగ్గరకు వస్తుంటే.. జంక్షన్లు, బస్‌బేల్లో ఉన్న సీసీ కెమెరాలు అప్రమత్తమవుతాయి. రెండు కూడళ్ల మధ్యలోనే వాటి వేగం తగ్గించాల్సిందిగా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు సూచనలు చేస్తాయి. 

ఇక ప్లేటు మార్చలేరు 
నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నంబర్లను తమ వాహనాల నంబర్‌ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఇలాంటి వాళ్ల ఆట కట్టించేందుకు ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడింగ్‌ సిస్టమ్‌ (ఏఎన్‌పీఆర్‌) సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడనుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది.  

అత్యవసర వాహనాలకు గ్రీన్‌ చానల్‌
సిటీలోని అనేక రోడ్లలో ట్రాఫిక్‌ మధ్య అంబులెన్స్‌లు ఇరుక్కుపోతున్నాయి. అత్యంత ప్రముఖుల వాహనాలు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వీటికి ట్రాఫిక్‌ జామ్స్‌ ఎఫెక్ట్‌ లేకుండా గ్రీన్‌ చానల్‌ కల్పించడానికి ట్రాఫిక్‌ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ‘డివైజ్‌’ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎంపిక చేసిన అంబులెన్స్‌ను, అర్హులైన ప్రముఖుల వాహనాలకు ఈ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా జంక్షన్‌కు 200 మీటర్ల దూరానికి ఆ వాహనాలు వచ్చిన వెంటనే.. అవి వస్తున్న వైపు సిగ్నల్‌ లైట్‌ గ్రీన్‌గా మారిపోతుంది. మిగిలిన మార్గాల్లో వాహనాలు ఆపడానికి రెడ్‌ లైట్‌ పడుతుంది.  

ట్రాఫిక్‌ స్థితిగతులు..
నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్‌ మెసేజ్‌ సైన్‌ బోర్డులుగా (వీఎంఎస్‌) పిలిచే డిజిటల్‌ బోర్డులద్వారా వాహనదారులు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలూ ప్రదర్శిస్తారు. సాంకేతిక లోపాలతో ఆగిపోయే వాహనాల గుర్తింపునకు ఐటీఎంఎస్‌లో ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎంఎస్‌) ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్రేక్‌డౌన్‌ వాహనాలను గుర్తించడంతోపాటు ఏ మార్గాల్లో ట్రాఫిక్‌ని నియంత్రించాలి, ఎక్కడ ఆపేయాలి అనే అంశాలను విశ్లేషిస్తుంది. 

ఆగకుండా ముందుకు సాగేలా
రద్దీ వేళల్లో వాహనచోదకుల్ని ట్రాఫిక్‌ జామ్స్‌ కంటే ఎక్కువగా రెడ్‌ సిగ్నల్స్‌ ఇబ్బంది పెడుతుంటాయి. గమ్య స్థానాల వైపు ప్రయాణించే వాహనాలను దాదాపు ప్రతి చౌరస్తాలోనూ రెడ్‌ సిగ్నల్‌ నేపథ్యంలో ఆగుతూ వెళ్లాల్సిన పరిస్థితులు సర్వసాధారణం. ఇలా కాకుండా ఉండేందుకు అన్ని జంక్షన్ల ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను అనుసంధానం చేయనున్నారు. ఇలా చేయడంతో ఓ జంక్షన్‌లో ఆగిన వాహనం గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాత ముందుకు కదిలితే.. సమీపంలో ఉన్న మిగిలిన జంక్షన్లలో ఆగాల్సిన పని ఉండదు.  

ఈవెంట్‌ ఉంటే ‘నో గ్రీన్‌’ 
ఓ చౌరస్తాకు అవతలి వైపు ఏమైనా ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశాలతోపాటు అనుకోకుండా ఏర్పడే అవాంతరాలు వంటి ‘ఈవెంట్‌’ఉన్నా.. ఈ విషయాన్ని ముందే సర్వర్‌లో ఫీడ్‌ చేస్తారు. ఫలితంగా ఆ రూట్‌లోకి వెళ్లాలని ప్రయత్నించే వాహనాలకు నిత్యం రెడ్‌ లైటే కనిపిస్తుంది. అక్కడుండే వీఎంఎస్‌ బోర్డుల ద్వారా వాహనచోదకుడికి విషయాన్ని వివరిస్తూ ప్రత్యామ్నాయ మార్గంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. 

ఉల్లంఘనులకు ఈ–చెక్‌ 
వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతోపాటు ఉల్లంఘనులకు చెక్‌ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేస్తున్నారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్‌ ఆధారంగా ఈ–చలాన్‌ సైతం ఆటోమేటిక్‌గా సంబంధిత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది.  

చౌరస్తాల్లో కాల్‌ బ్యాక్స్‌ 
ఐటీఎంఎస్‌లో భాగంగా చౌరస్తాలు, కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌ (ఈసీబీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ బాక్సులోని బటన్‌ నొక్కిన వెంటనే.. అక్కడ ఉండే కెమెరా సైతం యాక్టివేట్‌ అవుతుంది. దీంతో టీసీసీసీలో ఉండే సిబ్బంది ఫిర్యాదు చేస్తున్న వ్యక్తిని చూడటంతోపాటు అతడు చెప్పేది విని స్పందిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement