
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) కోసం నగరానికి వచ్చిన ఆమె రెండో రోజూ బిజీబిజీగా గడిపారు. బుధవారం ఉదయం అమెరికా బృందంతో కలసి ట్రైడెంట్ హోటల్‌లోనే ఇవాంకా బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
పది గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుని.. జీఈఎస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘వి కెన్ డూ ఇట్’అనే అంశంపై చర్చాగోష్టిలో పాల్గొన్నారు. 11.15 గంటలకు చర్చాగోష్టి ముగియగానే తిరిగి బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు. గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్న ఇవాంకా 12.50 గంటల ప్రాంతంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పలువురు మహిళా పారిశ్రామికవేత్తలతో ఇవాంకా హోటల్‌లోనే ముఖాముఖిలో పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్
మధ్యాహ్నం గోల్కొండ ఖిల్లాకు..
ఇవాంకా గోల్కొండ పర్యటనపై బుధవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇవాంకా భద్రతాధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన షెడ్యూల్‌లో గోల్కొండ పర్యటన వివరాలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో విందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఇవాంకా గోల్కొండకు వస్తున్నట్టు ఆమె భద్రతాధికారులు రాష్ట్ర పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటికప్పుడు గ్రీన్‌చానల్ ద్వారా ఇవాంకా 2.35 గంటల ప్రాంతంలో ట్రైడెంట్ నుంచి గోల్కొండ కోటకు చేరుకున్నారు. గంట పాటు గోల్కొండ విశేషాలు తెలుసుకుని 3.35 ప్రాంతంలో తిరుగు పయనమైన ఇవాంకా 3.55 గంటలకు ట్రైడెంట్‌కు చేరుకున్నారు.
ఎస్పీజీ అసంతృప్తి..
ప్రధాని మోదీ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) రాష్ట్ర పోలీస్ అధికారులపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవైపు ఫలక్‌నుమాలో విందు జరుగుతుంటే టీవీ చానళ్లు సీసీఫుటేజ్ ఆధారంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం భద్రతకు ఇబ్బందిగా మారిందని, ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరైన వారి భద్రత విషయంలో ఇలా వ్యవహరిం చడం మంచిది కాదని రాష్ట్ర పోలీస్ అధికారులను కాస్త ఘాటుగానే హెచ్చరించినట్టు తెలిసింది. అయి తే అప్పటికప్పుడు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజ్ ప్రసారం ఆపాలని అన్ని మీడియా చానళ్లను కోరడంతో టీవీ చానళ్లు ప్రసారాలు ఆపేశా యి. ఈ ఒక్క విషయం తప్పా భద్రతా పరంగా రాష్ట్ర పోలీస్ శాఖ సక్సెస్ అవడంతో ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది.
సాయంత్రమే డిన్నర్.. తిరుగు ప్రయాణం..
తిరుగు ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 5.30 సమయంలోనే అధికార బృందంతో కలసి ఇవాంకా ట్రైడెంట్‌లో డిన్నర్ పూర్తిచేశారు. 7.25 సమయంలో బస చేసిన హోటల్ నుంచి బయలు దేరి రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నీతిఆయోగ్ అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతా ధికారులు ఇవాంకాకు వీడ్కోలు పలికారు. 9.20 ప్రాంతంలో దుబాయి వెళ్లే ఎమిరేట్స్(ఈకే 529) విమానంలో తిరుగు పయనమయ్యారు.
ఎంతో హడావుడి.. కానీ సాదాసీదాగా..
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకా పర్యటనకు ఎంతో హడావుడి చేశాయి. అయితే ఇవాంకా అమెరికా నుంచి సాధారణ ప్రయాణికురాలిగా అందరితో కలసి కమర్షియల్ విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కాన్వాయ్ వాహనాలను సైతం కాదని అందుబాటులో పెట్టుకున్న రెండో వాహన శ్రేణిలో తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. హెచ్‌ఐసీసీలోనూ అందరితో తాను అంటూ సదస్సులో పాల్గొని ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment