జగన్ జోష్‌తో నగరం హోరెత్తింది. ఆదివారం సికింద్రాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో జగన్ సభలకు జనం పోటెత్తారు. ‘జయహో జగన్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతాలన్నీ మార్మోగాయి.
- సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో పోటెత్తిన జనం
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: జగన్ జోష్‌తో నగరం హోరెత్తింది. ఆదివారం సికింద్రాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో జగన్ సభలకు జనం పోటెత్తారు. ‘జయహో జగన్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతాలన్నీ మార్మోగాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే మూడు గంటలు ఆలస్యంగా జగన్‌మోహన్‌రెడ్డి సభాస్థలికి చేరుకున్నా.. గంటల తరబడి జగన్ కోసం వేచిచూసిన జనం ఆయన రాకతో ఒక్కసారిగా ఉప్పొంగిపోయారు. తొలుత సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట, తార్నాక, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్, చిలకలగూడ, మెట్టుగూడ, మారేడుపల్లి తదితర కాలనీల నుంచి వేలాదిగా తరలి వచ్చిన జనంతో అడ్డగుట్ట చౌరస్తా కిక్కిరిపోయింది.
బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచిరాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ సభా ప్రాంగణానికి చేరుకోగానే అభిమానులు పెద్దఎత్తున ఆయనకు ఎదురెళ్లి ఘనస్వాగతం పలికారు. జగన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్యకర్తలకు అభివాదం చే స్తూ అన్నా.. అక్కా.. చెల్లి.. అంటూ, ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతుంటే.. అభిమానుల ‘జై జగన్’ నినాదాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.
జనసంద్రమైన కూకట్‌పల్లి దారులు
జగద్గిరిగుట్ట పరిధిలో జరిగే బహిరంగసభలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు జనం బారులు తీరారు. గంటల తరబడి ఆయన కోసం వేచి చూసి ఆయనతో కరచాలనానికి పోటీ పడ్డారు. ఆదివారం రాత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ ఫై ్లఓవర్ బ్రిడ్జి మీదుగా బాలానగర్, వై జంక్షన్, కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీ వరకు రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు వివిధ డివిజన్ల నుంచి భారీయెత్తున ద్విచక్రవాహనాల్లో వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. ఫతేనగర్ ఫై ్లఓవర్ బ్రిడ్జి వద్ద వేలాది మంది ప్రజలు జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు.
ఈ సందర్భంగా వందలాది ద్విచక్రవాహనాలు కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి ఫతేనగర్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. దీంతో కూకట్‌పల్లి రోడ్డంతా కిక్కిరిసి పోయింది. జగన్‌మోహన్‌రెడ్డి వెంట మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి, ముక్కా రూపానందరెడ్డి, ఆదం విజయ్‌కుమార్, సాజిద్ అలీ, నాయకులు కె.శివకుమార్, సాయి సుధాకర్, చెలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు జగన్ జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కూడా నగరంలో విస్తృత పర్యటన చేయనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే జగన్ రోడ్ షో ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా సాగి ఎల్బీనగర్‌కు చేరుకుంటుంది. ఆయా నియోజకవర్గాల్లో జరిగే జగన్ రోడ్ షోకు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా హాజరుకావాలని ఆ పార్టీ ముఖ్య నాయకుడు శివకుమార్ విజ్ఞప్తి చేశారు.