
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి గురువారం ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్టాడుతూ ..సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసమే మంత్రిని కలిసినట్లు పేర్కొన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్దే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం 14సంవత్సరాల తరువాత హరీష్‌ను కలిసినట్లు ఆయన వెల్లడించారు. జగ్గారెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించినట్లు అయన మీడియాకు తెలిపారు. కాగా నిన్న, మొన్నటివరకూ విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి తాజాగా హరీష్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.