మరోసారి కేసీఆర్ తో జగ్గారెడ్డి అమీతుమీ!
మరోసారి కేసీఆర్ తో జగ్గారెడ్డి అమీతుమీ!
Published Wed, Aug 27 2014 1:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
మెదక్ జిల్లా రాజకీయాల్లో కేసీఆర్, తూర్పు జయప్రకాశ్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి గత కొద్దికాలంగా కొనసాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ పై మాటల తూటాలను సంధించడంలో తుర్పూ జయప్రకాశ్ అలియాస్ జగ్గారెడ్డికి ఎవరూ సాటి రాలేరనేది కాదనలేని వాస్తవం. బీజేపీలో టైగర్ నరేంద్ర అనుచరుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకుని.. ఆయనతోపాటు టీఆర్ఎస్ లో చేరారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్యెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి .. కేసీఆర్ పై రెబెల్ కార్యకలాపాలు కొనసాగించారు. టీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా, ఆతర్వాత ఆపార్టీలో చేరిన జయప్రకాశ్ అవకాశం చిక్కిన ప్రతిసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
మెదక్ జిల్లా రాజకీయాల్లో గత పదేళ్లలో కేసీఆర్ ను తూర్పార పట్టడమే లక్ష్యంగా పెట్టుకుని కొంత మేరకు జిల్లాలో పట్టు సాధించారు. జిల్లా పార్టీలో వ్యవహారాల్లో ఒంటరిగానే తనదైన స్టైల్లో ప్రభావితమైన రాజకీయాలు నడిపాడు. కార్యకర్తల, కాంగ్రెస్ పార్టీ బలంతో గులాబీ బాస్ ను ఎదుర్కొన్న జగ్గారెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి బలంగా వీచడంతో ఆయన పరాజయం పాలవ్వక తప్పదలేదు. ఓటమి తర్వాత కూడా జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయాల్లో ఉంటూ బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు సాగించారు. ఆ క్రమంలో ఆమధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా భేటి అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో జరుగుతున్న మెదక్ లోకసభ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానంటూ చెప్పుకుంటూ వచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎదురు చూశారు. అయితే సునీతా లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఇక చేసేదేమి లేక బీజేపీ టికెట్ కోసం పావుల్ని చకచకా కదిపారు. ఓ దశలో అంజిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువాను భుజాన వేసుకుని మరోసారి కేసీఆర్ ను ఢీకొట్టేందుకు సిద్దమయ్యారు. మెదక్ ఎన్నికల బరిలో జగ్గారెడ్డి రాకతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురై పరాభవానికి జగ్గారెడ్డి సమాధానం చెబుతారా? మెదక్ పార్లమెంట్ సీటును గెలుచుకుని జిల్లా రాజకీయాల్లో గులాబీ దండు, కేసీఆర్ అధిపత్యానికి గండి కొడుతారా అనే ప్రశ్నలకు జవాబు కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.
Advertisement