హంతకుడికి జీవితఖైదు | Jagityala court give the sensational judgment | Sakshi
Sakshi News home page

హంతకుడికి జీవితఖైదు

Published Fri, Mar 31 2017 9:26 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పుచెప్పారు.

జగిత్యాల కోర్టు సంచలన తీర్పు
జగిత్యాల: హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి పి.రంజన్‌కుమార్‌ గురువారం సంచలన తీర్పుచెప్పారు. సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాంబశివరెడ్డి కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామానికి చెందిన మోతె పుల్లయ్య ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం తన కుటుంబంతో కలిసి మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌ అనుబంధ గ్రామమైన విట్టంపేటకు వచ్చాడు. ఈయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు మోతె బంగారం గ్రామంలో 7వ తరగతి వరకు చదివాడు.

ఉపాధి కోసం చూస్తుండగా విట్టంపేట గ్రామానికి చెందిన ఆరెల్ల చిన్నరాజగౌడ్‌ మెట్‌పల్లి–కమ్మర్‌పల్లి రోడ్డులో సత్తక్కపల్లె శివారులో శివ హోట్‌ల్‌ పేరుతో దాబా ఏర్పాటు చేశాడు. ఈ హోటల్‌లో బంగారం సర్వర్‌గా చేరాడు. ఇదే హోటల్‌లో ప్రస్తుతం మెట్‌పల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన బండ్ల దేవదాసు సైతం సర్వర్‌గా పనిచేసేవాడు. 2015, ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి 10 గంటల వరకు హోటల్‌లో పనిచేసిన ఇద్దరూ అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం హోటల్‌ యజమాని రాజగౌడ్‌ వచ్చి చూసేసరికి బంగారం తల హోటల్‌ వెనుకభాగంలో, మొండెం హోటల్‌ సమీపంలో పడి ఉంది. బంగారం యువకుడితో ఆ రోజు హోటల్‌లో పడుకున్న బండ్ల దేవదాసు కనిపించకుండా పోయాడు. దీంతో యజమాని బంగారం తల్లితండ్రులకు విషయం తెలుపగా, సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అనంతరం, మృతుడి తండ్రి మోతె పుల్లయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్సై రాజిరెడ్డి కేసు నమోదు చేసుకోగా, అప్పటి మెట్‌పల్లి సీఐలు కె.రాజశేఖర్‌ రాజు, వి.సురేందర్‌ విచారణ చేశారు. విచారణలో దేవదాసే నిందితుడని, ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి వివాదం తలెత్తడంతో ఓ పదునైన కత్తితో హత్య చేసి, తల, మొండెం వేరుచేశాడని నిర్ధారించారు. దీంతో, పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీట్‌దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారి సత్యనారయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌రెడ్డి 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన అనంతరం, నిందితుడు బండ్ల దేవదాసుకు జీవితఖైదుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement