రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు కురుస్తున్నాయని రైతులు వరి నార్లు పోయొద్దని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధనా కేంద్రం శనివారం ప్రకటనలో తెలిపింది. నవంబర్ 15 కంటే ముందు వరి నార్లు పోయకూడదని, అంతకు ముందే నార్లు పోస్తే చలికి దిగుబడి రాదని పేర్కొంది.
నీట మునిగిన పొలాల్లో నీటి మట్టం తగ్గిన వెంటనే ఎకరాకు 35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలని శాస్త్రవేత్తలు చెప్పారు. సిఫారసు చేసిన మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడకూడదన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే గాలిలో అధిక తేమ శాతం వల్ల సుడిదోమ, కంకినల్లి, అగ్గి తెగుళ్ల ఉధృతి పెరుగుతాయని..రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.