- కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి
సుబేదారి : జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నాయకులు బుధవారం కలెక్టర్ జి.కిషన్‌ను కోరారు.
బుధవారం కలెక్టర్ కిషన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్ మాట్లాడారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారని అన్నారు.
అలాగే వరంగల్ జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారన్నారు. జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో సుమారుగా 800 మంది జర్నలిస్టుల పిల్లలు ఇందుకు అర్హులని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి ఉచిత విద్యను అందజేయాలని వారు కోరారు.
దీనిపై జిల్లా కలెక్టర్ జి. కిషన్ స్పందిస్తూ రంగారెడ్డి జిల్లాలో జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పరిశీలించి చర్యలు తీసుకుంటానని, జిల్లా విద్యాశాఖాధికారికి ఈ విషయమై ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఐజేయూ నాయకుడు దాసరి కృష్ణారెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి విఠల్, తోట సుధాకర్, జిల్లా నాయకులు కంకణాల సంతోష్, సదాశివుడు, ఎండీ.వాజిద్, గోకారపు శ్యాం, బి.సునిల్‌రెడ్డి, నవీన్, ప్రదీప్ పాల్గొన్నారు.