
140 కోట్లతో జూనియర్ కాలేజీల అభివృద్ధి
డీఎస్సీపై తగు సమయంలో నిర్ణయం
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి పక్కా చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రూ. 140.75 కోట్లతో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 402 కాలేజీలుంటే అందులో 332 కాలేజీలకు సొంత భవనాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 70 కాలేజీలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో 15 కాలేజీలకు స్థలాలు లేవని, దీంతో అవి స్కూళ ్ల ఆవరణలో కొనసాగుతున్నాయన్నారు. వాటికి స్థలాలను సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముందుగా ఆర్‌ఐడీఎఫ్-20 కింద రూ. 58.50 కోట్లతో 26 కాలేజీలకు (ఒక్కో దానికి రూ. 2.25 కోట్లు) సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు.
మిగతా కాలేజీలకు ఆర్‌ఐడీఎఫ్-21లో సొంత భవన నిర్మాణాలను ప్రతిపాదించామన్నారు. అవీ త్వరలోనే వస్తాయని, మొత్తంగా ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్‌ఐడీఎఫ్-20లోనే 69 కాలేజీలకు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామన్నారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా 177 జూనియర్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొత్త కాలేజీల మంజూరుపై మరో 15 రోజుల్లో పరిశీలించి అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు కాకుం డా మరో 600 ఖాళీలు ఉన్నాయన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక మిగతా వాటిపై నిర్ణయం ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లలో ఇవీ ఉండే అవకాశం ఉందన్నారు. వర్సిటీల చట్టం రూపకల్పన తరువాత వీసీలను నియమిస్తామని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కొత్త డీఎస్సీ ప్రకటనపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.