నేనెట్ల కోవర్టునయిత?: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనను కోవర్టుగా పార్టీ నాయకులే కొందరు అభివర్ణిస్తున్నారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు కె.జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. రుణ మాఫీపై రైతుల నుంచి దరఖాస్తు చేయించడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని టీపీసీసీ తీసుకున్న ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.
నెలరోజుల పాటు గ్రామాల్లో రైతుల నుంచి, విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, దీనికి ప్రస్తుత జిల్లాల వారీగా బాధ్యులుగా ముఖ్యనేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టడంపై పార్టీ ముఖ్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తి వెలిబుచ్చినట్లుగా తెలిసింది. ఇదే సందర్భంలో జానారెడ్డి మాట్లాడుతూ..
తనపై కొందరు పార్టీ నేతలే అనుచితంగా మాట్లాడుతున్నారని, కోవర్టునంటూ తననుద్దేశించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కోవర్టంటూ తాను మాట్లాడలేదని వి.హనుమంతరావు సమాధానం ఇవ్వడంతో ఈ చర్చ సద్దుమణిగింది. రేవంత్ విమర్శల గురించి కాంగ్రెస్‌పార్టీ ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టుగా సమాచారం.