కాకతీయ, రిమ్స్‌లకు మహర్దశ
* సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా అభివృద్ధి
* పీఎంఎస్‌ఎస్‌వై కింద తొలిదశలో అనుమతి
* కాకతీయకు 20, ఆదిలాబాద్ రిమ్స్‌కు 16 పీజీ సీట్లు
* అదనంగా 360 పడకలు, 80 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు
* ఏపీలోని సిద్ధార్థ, అనంతపురం కళాశాలలకూ యోగం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వస్తున్న నిధులతో తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు మహర్దశ పట్టనుంది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై-3) కింద ఎంపిక చేసిన ఈ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా రూపుదిద్దుకోనున్నాయి. ఇందులో తెలంగాణలో కాకతీయ మెడికల్ కళాశాల (వరంగల్), రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్-ఆదిలాబాద్) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల (అనంతపురం), సిద్ధార్థ వైద్య కళాశాల (విజయవాడ) ఉన్నాయి.
వారం క్రితమే పీఎంఎస్‌ఎస్‌వై కింద ఎంపిక చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలపై బిహార్ రాజధాని పట్నాలో సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి వివరించారు. ఆ నిర్ణయాల ప్రకారం ఈ కళాశాలలకు భారీగా సూపర్ స్పెషాలిటీ విభాగాలు రానున్నాయి. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలు మంజూరైనట్టు తెలిసింది.
కాకతీయ మెడికల్ కళాశాలకు 8, సిద్ధార్థ వైద్య కళాశాలకు 8, ప్రభుత్వ వైద్య కళాశాల(అనంతపురం)కు 8 లెక్కన సూపర్ స్పెషాలిటీ వార్డులకు ప్రాథమిక స్థాయిలో అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఈ సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో ప్రధానంగా అంకాలజీ (క్యాన్సర్), నెఫ్రాలజీ (మూత్రపిండాల వ్యాధులు), ఎండోక్రినాలజీ (గ్రంధులు), కార్డియాలజీ (గుండె జబ్బులు), న్యూరాలజీ (నరాల జబ్బులు), న్యూరో సర్జరీ (నరాలకు శస్త్రచికిత్సలు), పీడియాట్రిక్ సర్జరీ (శిశువుల రుగ్మతలకు సంబంధించిన శస్త్రచికిత్సలు), ఈఎన్‌టీ (చెవి ముక్కు గొంతు), ఆర్థోపెడిక్ (ఎముకలకు సంబంధించిన జబ్బులు), బర్న్స్ అండ్ ప్లాస్టిక్ (కాలిన గాయాలకు చికిత్స) సర్జరీ తదితర విభాగాలుంటాయి.
ఈ విభాగాలకు అవసరమైన సాంకేతిక పరికరాలు, భవనాల నిర్మాణం, అధ్యాపకులు, సిబ్బంది నియామకం అన్నీ కేంద్రం అధీనంలోనే జరుగుతుంది. ఈ కళాశాలలకు త్వరలోనే ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు పరిశీలనకు రానున్నాయి. దేశవ్యాప్తంగా 13 కళాశాలలను పీఎంఎస్‌ఎస్‌వై కింద ఎంపిక చేస్తే అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవే నాలుగు ఉండటం విశేషం. ఇప్పటికే ఒక్కో కళాశాలకు రూ.150 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో కేంద్రం రూ.120 కోట్లు ఇస్తే, మిగతా రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.