సాక్షి, హైదరాబాద్ : ‘జనతా కర్ఫ్యూలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలె. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు. అత్యవసర సేవలను మినహాయించి ఆదివారం టోటల్ షట్‌డౌన్ చేస్తున్నామన్నారు.
జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని, 24 గంటలపాటు నియంత్రణ పాటించకపోతే ఏమీ సాధించలేమని చెప్పారు. 60 ఏళ్లు పోరాడి కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి సాధించుకున్న తెలంగాణ జాతి స్ఫూర్తిని చాటాలని, కరోనా వైరస్ తెలంగాణ వారిని ఏం చేయలేకపోయిందనే పేరు తెచ్చుకోవాలన్నారు. అందరం కలిస్తే తప్ప కోవిడ్–19 నివారణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటికి మనం ఇలా ఉన్నం. రేపు ఏమైతదో చెప్పలేం. రేపు విజృంభించవచ్చు కూడా. విజృంభించకూడదంటే నియంత్రణ పాటించడమే శ్రీరామరక్ష’అని కేసీఆర్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే...
చీమ చిటుక్కు మనకూడదు..
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో చీమ చిటుక్కుమనకూడదు. 100 శాతం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు మూసేస్తున్నం. ఒక్క బస్సూ నడవదు. ముందుజాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితిలో వాడుకోవడానికి ప్రతి డిపోలో 5 బస్సులు, 10 మంది సిబ్బందితోపాటు హైదరాబాద్‌లో 5 మెట్రో రైళ్లను సిద్ధంగా ఉంచుతాం. వాటిని వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిని తరలించడానికి వాడుకుంటం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులనూ అనుమతించం. సరిహద్దుల్లోనే ఆపేస్తాం. ఎవరైనా వస్తే పోలీసులు పట్టుకుంటరు. కఠిన సమయంలో కఠినంగా ఉండాలి. సంకట పరిస్థితిలో స్వీయ నియంత్రణే కాపాడుతది. వర్తక, వాణిజ్య వర్గాలు దుకాణలు, మాల్స్‌ను స్వచ్ఛందంగా మూసేయాలి. నిత్యవసర వస్తువుల కొరత రాకూదని, చిన్న వ్యాపారాలు దెబ్బతిన వద్దని, మాంసం, చేపలు, కూరగాయాల దుకాణాల వంటి అసంఘటితరంగ వ్యాపారాలు దెబ్బతినవద్దని వాటిని బ్యాన్ చేస్తలేం. ఆదివారం ఒక్క రోజు మాత్రం అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలి.
ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయాలు, పెట్రోల్ బంకులు నడుపుకోవచ్చు. మీడియా మిత్రులు తిరగవచ్చు. అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, సీవరేజీ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేస్తరు. మిగిలిన వారందరూ స్వచ్ఛందంగా ఎవరికి వారే మూసేయాలి. మనం, మన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రపంచం, యావత్ మానవాళి కోసం 24 గంటలు ఏ వ్యక్తికావ్యక్తి కచ్చితంగా నియంత్రణ పాటించి ఇంట్లోనే ఉండాలి. ఇంటికి పనిమనుషులు, సేవకులు రావాలని అనుకోకండి. ఒక రోజు మీ పనులు మీరే చేసుకోండి. కూలీలు, కార్మికూలూ 24 గంటలు ఇళ్లకే పరిమితం కండి. ఇవన్నీ పాటిస్తే కరోనా ప్రమాదం మనకు రాదు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా ఈ పని చేయాలి. నియంత్రణ పాటించని దేశాలు చాలా ఇబ్బందికి గురయ్యాయి. 60 ఏళ్లు పైబడినవారు, 10 ఏళ్లలోపు పిల్లలు దయచేసి 2–3 వారాలు బయటకు రాకండి. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా చనిపోతున్నరు. 30, 40, 50 ఏళ్ల వారు, యువకుల మరణాలు లేవు.
5 గంటలకు నేనూ చప్పట్లు కొడ్త..
ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలందరూ చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చిన ప్రధానిని అవహేళన చేసేలా కొందరు పనికిమాలిన వెధవలు వక్రబుద్దీతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారిని అరెస్టు చేయాలి. ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదు. ఆయన మన ప్రధాని.. గౌరవించాలి. నేను కూడా 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడ్తా. మా కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తరు. ఎక్కడ ఉన్నోళ్లు అక్కడ 2 నిమిషాలు చప్పట్లు కొట్టాలి. మన ఐక్యతతో ఈ మహమ్మారి పారిపోవాలి. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సైరన్లు మోగించే ఏర్పాట్లు చేశాం. రాష్ట్రం నలుమాలలా ప్రజలు బయటకు వచ్చి 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలి.
అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు బంద్..
మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందు చెప్పి సరిహద్దులు మూసేస్తం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తాం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నాం. (‘చెప్పిన మాట వినండి.. రేపు ఇంట్లోనే ఉందాం’)
సీసీఎంబీలో కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు..
హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కోవిడ్–19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నేను చేసిన విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. రోగుల సంఖ్య పెరిగితే సీసీఎంబీ సేవలను వినియోగించుకుంటాం.
ఆ సందర్భాలు ఏర్పడితే ఇళ్లకే రేషన్..
ప్రజలు బయటకు రాకూడని సందర్భాలు ఏర్పడితే ఇంటింటికీ రేషన్ మనమే వాహనాలు పెట్టి పంపాలి. ఎన్ని వాహనాలు అవసరమవుతాయి? ఎన్ని ఇళ్లకు పంపాలి అన్ని ఆలోచిస్తున్నం. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసయినా రేషన్ అందిస్తాం. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా తెలంగాణ బిడ్డలను కాపాడుకుంటాం. ప్రజలకు నయా పైసా కష్టం రానివ్వం. మందులు, నిత్యావసరాలు తదితరాలకు కేసీఆర్ బతికి ఉన్నంత వరకు 100 శాతం భరిస్తాం. రూ. 5 వేలు కోట్లు, రూ. 10 వేల కోట్లు ఖర్చయినా ప్రభుత్వమే ఆదుకుంటుంది.
వైద్యులు, వైద్య సిబ్బందిని కాపాడుకోవాలి..
వైద్యులు, వైద్య సిబ్బందిని ఆరునూరైనా కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న వారికి అభినందిస్తున్నం. వైద్యులకు ఇన్‌ఫక్షన్ వస్తే మన పనైపోయినట్టే. ఇతర రాష్ట్రాల నుంచి మనకు వైద్యులు రమ్మంటే రారు. అందుకే వైద్యులకు అవసరమైన పీపీ యూనిట్లు తెప్పించాం. ఇంకా తెప్పిస్తున్నాం. ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నం.
Comments
Please login to add a commentAdd a comment