ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
నయీంనగర్ : ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్స్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో సోమవారం సీపీఐ నగర శాఖ 24వ మహాసభలు జరిగాయి. నగర కార్యదర్శి మేకల రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
ఫలితంగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, ఆసరా, ఇంటింటికి నల్లా, కేజీ టూ పీజీ విద్య వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న కేసీఆర్.. మరో పక్క ఉన్న సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి, పక్కా ఇండ్లు నిర్మించడంతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
ధరలు పెంచుతున్న కేంద్రం
వంద రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హమీ ఇచ్చిన బీజేపీకి కేంద్రంలో పట్టం కడితే... ఈ వంద రోజుల్లో మోడీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచిందని వెంకట్‌రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని, మతోన్మాదాన్ని పెంచి పోషించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు.
ఇంకా ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి వలీ ఉల్లాఖాద్రీతో పాటు స్వామిచరణ్, వీరగంటి సదానందం, సిరబోయిన కరుణాకర్, నేదురుమల్లి జ్యోతి, దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వేయిస్థంబాల దేవాలయం నుంచి సభావేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.