సాగు నీరందించేందుకు సీఎం కృషి
మంత్రి జోగు రామన్న కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా రైతులకు సాగునీరందించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 8న ముంబరుు వెళ్లనున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట మంత్రి రామన్నతోపాటు టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వి.శోభారాణి, జెడ్పీటీసీ సభ్యులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సర్కారు చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణాల వల్ల ప్రతి రైతు పొలానికి సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలో భాగంగా చనాఖ-కోర్టా బ్యారేజీ నిర్మాణం చేపట్టామని, ఇది గుర్తుంచుకుని కొందరు నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. చనాఖ -కోర్టా బ్యారేజీకి రూ.123 కోట్లు, పెన్‌గంగ ప్రాజెక్టుకు రూ.1,226 కోట్లు కేటాయించి నట్లు తెలిపారు. అనంతరం భూసార పరీక్షల సంచా ర వాహనంను పరిశీలించారు. అప్పటికప్పుడు రైతు పొలాల్లోని మట్టి నమూనాలను సేకరించి ఫలితాలను అప్పుడే ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా జెడ్పీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు ఏమాజీ, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.