హెరిటేజ్‌ ఓ జోక్‌లా మారింది! | KCR Fires On Heritage Property Issue In Assembly | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ ఓ జోక్‌లా మారింది!

Published Fri, Jul 19 2019 1:55 AM | Last Updated on Fri, Jul 19 2019 5:23 AM

KCR Fires On Heritage Property Issue In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హెరిటేజ్‌ (వారసత్వం) ఓ జోక్‌గా తయారైందని సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో ఏది పడితే దాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చారని తప్పుబట్టారు. కేవలం హైదరాబాద్‌ నగరంలోని కొందరు ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, దిల్‌కుషా గెస్ట్‌ హౌజ్‌తో సహా ప్రైవేటు గెస్ట్‌ హౌజ్‌లు, వారసత్వ సంపద జాబితాలో చేర్చారన్నారు. దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌ వారసత్వ సంపదా? అని సీఎం ప్రశ్నించారు. నగరం బయట ఉన్న ఎన్నో అద్భుతమైన కోటలను విస్మరించారన్నారు. చివరకు గాండ్ల బాలయ్యతో సహా నలుగురు ప్రైవేటు వ్యక్తుల ఇండ్లను వారసత్వ సంపద జాబితాలో చేర్చారని, గాండ్ల బాలయ్య పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. వైద్య కళాశాలల బోధన సిబ్బంది పదవీవిరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ బిల్లుపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా వారసత్వ కట్టడాలపై వచ్చిన ప్రస్థావనకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.

మన వారసత్వ సంపద, సంస్కృతిని గౌరవిస్తూనే అధునాతన సమాజ నిర్మాణానికి కూడా కొన్ని పనులు జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలోని చరిత్రాత్మకమైన కట్టడాలు, కోటల పరిరక్షణ కోసం సమగ్రమైన వారసత్వ సంపద చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అది జీవో కాదని, ఒక చట్టమని స్పష్టతనిచ్చారు. జీవో అనుకొని కోర్టుల్లో కొందరు వాదనలు చేస్తున్నారన్నారు. ఈ చట్టంపై నిపుణుల కమిటీ వేశామన్నారు. కమిటీ సిఫారసుల మేరకు ఏ కట్టడాలు జాబితాలో ఉండాలి, వేటిని తొలగించాలనేది నిర్ణయిస్తామన్నారు. అప్రాధాన్య కట్టడాలను జాబితాలోనుంచి తీసేస్తామన్నారు.  ఉస్మానియా ఆస్పత్రికి ఘనమైన చరిత్ర ఉందని, వారసత్వ సంపద అన్నారు. అదే స్థానంలో కొత్త ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్‌ ఉందన్నారు. అయితే వారసత్వ సంపద నిబంధనలు అడ్డువస్తున్నాయన్నారు.

ఈ అంశం హైకోర్టు పరిశీలనలో ఉందన్నారు. సరైన నిర్వహణ లేక చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేయగా సీఎం కేసీఆర్‌ ఈ మేరకు బదులిచ్చారు. నగర వారసత్వ సంపదను పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇదేం కొత్త కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నా చోద్యం చూస్తున్నారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం నుంచి ఒక్కో వైద్య విభాగాన్ని నగరంలోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ఘన చరిత్రను, సౌందర్యాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియాను పరిరక్షించడానికి రూ.25 కోట్లను కేటాయించామని సీఎం కేసీఆర్‌ బదులిచ్చారు. 

తక్షణమే వైద్య  సిబ్బంది నియామకాలు 
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,379 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేసేందుకు ఆస్కారం లేదని సీఎం పేర్కొన్నారు. సీనియర్‌ బోధన సిబ్బందిని రెడీమేడ్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోలేమన్నారు. వైద్య కళాశాలల బోధన సిబ్బంది పోస్టులను సీనియారిటీ ప్రకారం పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేయాల్సిన 801 బోధన సిబ్బంది పోస్టులను సత్వరంగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును గురువారం శాసనసభలో కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. పదవీ విరమణ వయస్సు పెంచినా యువ వైద్య బోధన సిబ్బందికి పదోన్నతుల్లో నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  

బోధన సిబ్బంది లేరని రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్లకు ఎంసీఐ కోత పెడుతోందన్నారు. ఏటా 50 మంది బోధన సిబ్బంది రిటైర్‌ అవుతున్నారన్నారు. పీజీ సీట్ల కోసం మన విద్యార్థులు బయటకు వెళ్లి కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందనే వయోపరిమితి పెంచామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, వైద్య కళాశాలల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతు తెలపాలని కోరారు.  రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీలు మద్దతు తెలపడంతో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement