
రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తనకు దైవంతో సమానమని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. పదవి పోయిన తరువాత రాజయ్య ఆదివారం రాత్రి 10 గంటలకు తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తనను తండ్రిలాగా ప్రోత్సహించారని చెప్పారు. ఊహించని విధంగా తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు.
ప్రభుత్వ అధికారులలో అవినీతి పెరిగిపోవడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన తప్పులను కేసీఆర్ పసిగట్టారు. మరో పెద్ద తప్పు జరుగకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసినట్లు రుజువైతే, ఏ శిక్షకైనా తాను సిద్ధమన్నారు. ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామిని అవుతానన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. ఒక కూలీగా పని చేస్తానన్నారు.
వైద్యశాఖ ప్రక్షాళన కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. తెలంగాణలో వైద్య రంగానికి సంబంధించి తాను చేసిన పనుల ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయన్నారు. కేసీఆర్ లక్ష్యం ఆరోగ్య తెలంగాణ అన్నారు. ఏసు ప్రభువుని నమ్మిన బిడ్డగా తను ఎటువంటి తప్పు చేయలేదని రాజయ్య చెప్పారు. త్వరలోనే తాను కేసీఆర్ను కలుస్తానన్నారు.