'గవర్నర్‌గిరీ'ని ఎండగట్టండి
-
టీఆర్‌ఎస్‌పీపీకి కేసీఆర్ మార్గనిర్దేశనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేషాధికారాలను కట్టబెట్టాలనుకుంటున్న కేంద్ర వైఖరిని పార్లమెంట్‌లో ఎండగట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డితో కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేషాధికారాలను ఇవ్వడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమేనని, దీనిపై జాతీయస్థాయిలో పోరాటం చేయాలని పార్లమెంటరీ పార్టీ నేతలకు సూచించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ సోమవారం వాయిదాతీర్మానం నోటీసులు ఇవ్వాలని ఎంపీలను ఆదేశించారు. వాయిదా తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీకి ఫోన్లు చేసినట్టు కేసీఆర్ ఎంపీలకు చెప్పారు. తమిళనాడు, మహారాష్ర్ట సీఎంలు జయలలిత, పృథ్వీరాజ్ చౌహాన్‌తోనూ మాట్లాడనున్నట్టుగా తెలిపారు. వీరితో పాటు జాతీయవ్యాప్తంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులను, పార్టీలను కూడగట్టే యత్నాలు చేయాలని సూచించారు.
హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేషాధికారాలు అమల్లోకి వస్తే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ కేంద్రం అమల్లో పెట్టేందుకు వెనుకాడదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ పోరాటానికి అన్ని పార్టీలూ కలసి వస్తాయని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంటులో వాయిదా తీర్మానం సమయంలోనే అన్ని పార్టీలు కలిసి వచ్చేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్లమెంటులో చర్చకు పెట్టేదాకా సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని, అనుసరించాల్సిన విషయాలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఎంపీలను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం లోక్‌సభలో టీఆర్‌ఎస్ నేత ఎ.పి.జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే బీజేపీయేతర ముఖ్యమంత్రులు కొందరితో మాట్లాడామని, మిగిలిన వారితోనూ మాట్లాడి కేంద్రప్రభుత్వ తీరును పార్లమెంట్‌లో ఎండగడతామని తెలిపారు.