వాగ్దానాలు నెరవేర్చడంలో..సీఎం కేసీఆర్ విఫలం | KCR promises fail | Sakshi
Sakshi News home page

వాగ్దానాలు నెరవేర్చడంలో..సీఎం కేసీఆర్ విఫలం

Published Wed, Mar 4 2015 11:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

KCR promises fail

మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రంగుల సినిమా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎంగా పాలమూరుకు వచ్చి ఒక బోరు మంజూరుచేశారని, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల పర్యటనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారని అన్నారు.
 
  టీఆర్‌ఎస్‌లో చేరాలని, లేకపోతే భయబ్రాంతులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పోరాటం చేయని తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారులపై కేసులుపెట్టి లాఠీచార్జి చేయించిన వీరు ఏ ప్రాతిపదికన మంత్రులకు అర్హులని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం ఎక్కడికెళ్లినా వందలు, వేలకోట్ల గురించి మాట్లాడుతున్నారే తప్ప.. పనులు ఎక్కడా జరగడం లేదన్నారు.
 
  రాష్ట్రంలో కరెంట్, రైతుల ఆత్మహత్యలు, కరువు ప్రాంతాలపై ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు నిధులు, పనుల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం రాష్ట్రంలో 14లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని వివరించారు.

ఎమ్మెలీ ఎన్నికల్లో ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బలమైన ప్రతిపక్షంగా నిలబడేందుకు ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రారావు గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, టీడీపీ నాయకులు సమ్మద్ ఖాన్, ఎన్‌పీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement