
మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, చిత్రంలోఎంపీ మల్లారెడ్డి
సాక్షి, కీసర: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 100 పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం కీసరలోని కేబీఆర్‌గార్డెన్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగున్నర ఏళ్ల కాలంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను మరో మారు గెలిపిస్తాయన్నారు.
తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తాను 2012 నుంచి టీఆర్‌ఎస్‌లో చురుగ్గా పని చేశానన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచి 43 వేల మెజారిటీతో గెలుపొందారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొంగర కలాన్ ప్లీనరీ తరువాత సీఎం కేసీఆర్ స్వయంగా తనకు మేడ్చల్ నుంచి మరో మారు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ మొదటి లిస్టులో తన పేరును కుడా చేర్చారని కొన్ని దుష్టశక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 రోజులుగా మేడ్చల్ టిక్కెట్ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో గత మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ తనను పిఠి లిపించుకొని కొన్ని కారణాలతో ఈ సారి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారని తెలిపారు.
అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాం...
మేడ్చల్ అభ్యర్థిగా ఎవరు ఎంపికైన వారిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు మేడ్చల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. పల్లారాజేశ్వర్‌రెడ్డి రెండు రోజుల క్రితం తన ఇంటికి ఎంపీ చామకూరమల్లారెడ్డిని తీసుకొచ్చారని ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లారెడ్డిని అధిష్టానం ప్రకటిస్తే ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తానని చెప్పానన్నారు. అందుకోసం ఇప్పటి వరకు తన వెంట ఉన్న నేతలు కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
ఎంపీ చామకూరమల్లారెడ్డి మాట్లాడుతూ.... మలిపెద్దిసుధీర్‌రెడ్డి గొప్ప నాయకుడని ఎంతో త్యాగ గుణమున్న వ్యక్తి అని కొనియాడారు. మలిపెద్దిసుధీర్‌రెడ్డి రాజకీయ అనుభవం తనకూ పార్టీకి ఎంతో అవసరమన్నారు. ఆయన సూచనల మేరకే తాను మందుకెళ్తానని పేర్కొన్నారు. నేతలను, కార్యకర్తలందరిని కలుపుకొని ముందుకెళ్తానన్నారు. ఎమ్మెల్యేగా బరిలో నిలువనున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. మేడ్చల్ ఇన్‌చార్జ్ రాష్ట్ర కార్యదర్శి జహంగిర్ మాట్లాడుతూ... మేడ్చల్ అభ్యర్థి గెలుపు బాధ్యత కేసీఆర్ సుధీర్‌రెడ్డిపై ఉంచారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట నిలబెట్టెందుకు సుధీర్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని చెప్పారు.
సుధీర్‌రెడ్డికి భవిష్యత్‌లో ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. కాగా కార్యకర్తల సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి మాట్లాడుతుండగా కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. సుధీర్‌రెడ్డి నాయకత్వం జిందాబాద్ అని నినాదాలు చేయడంతో సుధీర్‌రెడ్డి కల్పించుకొని కార్యకర్తలను శాంతపరచారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన కొందరు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో కీసర, శామీర్‌పేట, ఘట్‌కేసర్, మేడ్చల్ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment