
సౌజన్య మృతి కేసులో కీలక సమాచారం
విజయవాడ: ఇటీవల నగరంలో కలకలం రేపిన సౌజన్య అనే నవ వధువు అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి కీలక సమాచారం లభించింది. సౌజన్య మరణానికి ముందు ముంబైకి చెందిన వ్యక్తితో సెల్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో పాటు ఆభరణాలు ఇంట్లోనే ఉంచిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకే ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మే 27 వ తేదీన అజిత్సింగ్ నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని అపార్ట్‌మెంట్ నుంచి కిందకు పడి సౌజన్య మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా?లేక ఎవరైనా అనే దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు రెండో కుమార్తె సౌజన్యకు ఈ నెల 20వ తేదీన వివాహం జరిగింది. సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఆమెకు కృష్ణలంకకు చెందిన దిలీప్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్తో వివాహం అయింది. దంపతులు ఇద్దరూ హైదరాబాద్లోనే కాపురం పెట్టిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.