తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి శాసన సభలో అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ప్రస్తావన వచ్చింది.
⇒ స్పీకర్‌కు 4 పిటిషన్లు
⇒ సమర్పించిన బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి శాసన సభలో అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ప్రస్తావన వచ్చింది. ప్రజోపయోగానికి సంబంధించిన ఏదైనా అంశంపై ఎమ్మెల్యేలు ఈ కమిటీకి ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించి పరిష్కరించే దిశగా ఆ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గడచిన మూడేళ్లలో ఈ కమిటీ ఒక్క పిటిషన్‌ను కూడా పరిశీలించలేదు. అసలు పిటిషన్లే రాలేదు. ఈ కమిటీకి పిటిషన్స్ ఇవ్వ వచ్చన్న సమాచారం కూడా కొందరు ఎమ్మెల్యే లకు లేదనే అంశం మంగళవారం వెలుగు చూసింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్పీకర్ బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేరును పిలిచారు. వెంటనే కిషన్‌రెడ్డి లేచి తెలంగాణ శాసనసభ కొలువుదీరిన తర్వాత తొలిసారి పిటిషన్స్ కమిటీకి పిటిషన్లు అంద జేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఇవ్వబోయే పిటిషన్లే ఆ కమిటీ ముంగిటకు వెళ్లే తొలి పిటిషన్స్ అని పేర్కొన్నారు.
కిషన్‌రెడ్డి అందజేసిన పిటిషన్లు ఇవీ...
1. ఎస్సీ కార్పొరేషన్ 80 శాతం సబ్సిడీతో ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాల పథకాన్ని సక్రమంగా అమలయేటట్లు చూడాలి.
2. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేసే కుక్, క్లీనర్ల జీతాలను క్రమబద్ధీకరించాలి.
3. పేదలకు జారీ చేసిన అసైన్‌మెంట్ భూముల ఆక్రమణను నియంత్రించాలి.
4. మహిళా కానిస్టేబుళ్లకు పదోన్నతుల విషయంలో రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలి.