సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు మార్చటానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాసంఘాలు ఉద్యమించాలని కోరారు. దీనికోసం ప్రజా ఉద్యమాలు వచ్చే అవకాశముందన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలున్నాయనీ, ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వ్యవహారంపైనా సందేహాలున్నాయన్నారు. సీఈఓ రజత్‌కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆయన ప్రస్తుత ఆస్తులపై సీబీసీఐడీతో పూర్తిస్థాయి విచారణ చేయాలన్నారు.
ఓట్ల తొలగింపునకు బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పాలని, సీఈఓ రజత్‌కుమార్‌పై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. శనివారం టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వై.యోగేశ్వర్‌రెడ్డితో కలసి కోదండరాం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టలు మార్చినంత సులువుగా రాజకీయ నేతలు పార్టీలు మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో నేతలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిం దన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల విషయంలో స్పీకర్ సమానంగా వ్యవహరించాలన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ తరపున పలువురు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాభివృద్ధికి కట్టుబడిన వారికే టీజేఎస్ మద్దతు ఇస్తుందన్నారు. సర్పంచులకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామమన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైనన్ని నిధులు , ప్రత్యేకంగా విధులు కూడా ఇవ్వాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పంచాయతీలను ఏకగ్రీవం చేయటం మంచిది కాదని, వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్నారు.
బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సరికాదు..
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సరికాదనీ, దీనిపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తక్కువ చదువులు చదివిన నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం వెతకాలని చెప్పారు. ప్రైవేట్ రంగంలో స్థానికులకే అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలవైపు తాము వెళ్లడం లేదన్నారు. తెలంగాణలో చేయాల్సింది చాలా ఉందని, అయితే ఏపీ ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆవశ్యకత వివరిస్తూ.. గతంలో అనంతపురం నుంచి విశాఖ వరకు తిరిగామని, చీరాల చేనేత సమస్యలపై పోరాటం చేశామన్నారు. విశాఖ కాలుష్యం, ఏజెన్సీలో రేషన్ పంపిణీ వ్యవస్థపైనా గతంలో తాము పోరాటాలు చేశామన్నారు.
విలీనంఅవాస్తవం
తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని వస్తున్న ఊహాగానాలను కోదండరాం కొట్టిపారేశారు.ఆ వార్తలు అవాస్తవాలని వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నిస్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదనీ, పార్టీ కార్యవర్గమంతా చర్చించుకున్న తర్వాత వెల్ల్లడిస్తామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనుభవాల నుంచి ‘కూటమి’లోని పార్టీలు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కూటమి భవిష్యత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. టీజేఎస్ భవిష్యత్తు ఇతర పార్టీలపై ఆధారపడి ఉండదన్నారు. కూటమి వల్లే ఓటమి చెందామని కొందరు కాంగ్రెస్ నేతల చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంపై తాను స్పందించనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment