కలెక్టర్‌ దూకుడు.. అధికారుల హడల్‌.. | Komaram Bheem Collector Sandeep Kumar Work Speedily | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ దూకుడు.. అధికారుల హడల్‌..

Published Wed, Feb 26 2020 8:10 AM | Last Updated on Wed, Feb 26 2020 8:47 AM

Komaram Bheem Collector Sandeep Kumar Work Speedily - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాకు నూతంగా వచ్చిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తన మార్క్‌ పాలన చూపుతున్నారు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈనెల 3 నుంచి విధుల్లో చేరిన నుంచి తనదైన శైలిలో అధికార, రోజువారి పాలనలో వినూత్నంగా వ్యవహరిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లోనే తన మార్కును చూపించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారు. 

తహసీల్దార్ల బదిలీలు..
అధికారులు ఒకవేళ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహారణ.. ఆదివారం జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను ఒక్కసారిగా బదిలీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ బదిలీల వెనక అసలు కారణం తహసీల్దార్లు ఎవరూ ఆయా మండలాల హెడ్‌ క్వార్టర్స్‌లలో లేకపోవడంతోనే ఆగ్రహంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ బదిలీలతో విధుల పట్ల ఆలసత్వం వహించే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది. దీంతో ఇతర విభాగాల అ«ధికార యంత్రాంగం కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి్సన ఆవశ్యకం ఏర్పడుతుంది. 

ప్రక్షాళన షురూ..
దేశంలోనే వెనకబడిన జిల్లాగా ఉన్న గిరిజన ప్రాంతమైన కుమురం భీం జిల్లాలో అధికార యంత్రాంగం మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులతో పోల్చితే కాస్తా భిన్నంగా ఉంటుంది. వేరే ప్రాంతం వారు ఇక్కడ వచ్చి పనిచేసేందుకు పెద్దగా ఆసక్తిచూపని సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో పనిచేస్తున్న వాళ్లు సైతం ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో అనేక ఫైళ్లు, కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. వీటన్నింటిని నివారించేందుకు జిల్లా యంత్రాంగం అంతా తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మండలాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ కూడా హెడ్‌క్వార్టర్‌ దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు.

జిల్లాలో ఈ– ఆఫీస్‌ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ విధానంలో మొత్తం సమాచారం అంతా అన్‌లైన్‌లోనే సాగనుంది. ఇందులో భాగంగా ప్రతి ఆఫీస్‌కు ప్రత్యేకమైన మెయిల్‌కు, ప్రత్యేకమైన లాగిన్‌తో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతిశాఖలో ప్రతిస్థాయిలో ఏదైనా ఒక ఫైల్‌ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఓ సర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ– ఆఫీస్‌ అమలు అయితే కిందిస్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకూ వివిధ దశలలో ఫైళ్లు ఎక్కడ పెండింగ్‌ ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఎవరూ విధుల్లో అలసత్వం వహిస్తారో సులువుగా గుర్తించవచ్చు. అలాగే ప్రతివారం వచ్చే ప్రజా ఫిర్యాదుల్లో ఆలసత్వం వహించద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి..
గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులైనా విద్య, వైద్యంపైనే ప్రధానంగా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన వైద్యం అందని స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యలను అధిగవిుంచేలా జిల్లా వైద్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో సర్కార్‌ బడులు, ఆశ్రమ, ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన విద్యను అందించేలా కొత్త కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇప్పటికే విద్య, వైద్య పరిధిలో సంబంధిత సమచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు శాఖలే కాకుండా జిల్లాలో ఇతర ప్రభుత్వ శాఖలపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా స్థితి గతులను తెలుసుకుంటున్నారు. ఏ శాఖ ఎక్కడ వెనకబడి ఉందో గుర్తించి అందుకు తగినట్లుగా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. గతంలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్ల కంటే కొత్త కలెక్టర్‌ నిక్కచ్చిగా వ్యవహరించడంతో అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎక్కడైనా ఏమైనా పోరపాటు జరిగితే ఎలా స్పందిస్తారో అని అధికార యంత్రాంగం అంతా ముందు జాగ్రత్తలు పడుతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement