నీటి పంపకాలు, పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై చర్చ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలు, ఎంపిక చేసిన ప్రాజెక్టు పాయింట్ల వద్ద ఏర్పాటు చేయనున్న టెలి మెట్రీ వ్యవస్థలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం భేటీ కానుంది. జలసౌధలో మధ్యాహ్నం 12కు జరిగే భేటీకి తెలంగాణ, ఏపీల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు, బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ హాజరు కానున్నారు. ప్రధానంగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంపిణీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
తెలం గాణ ఇప్పటికే నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1.5 టీఎంసీలు కోరగా, కృష్ణా డెల్టా కింద తాగునీటికి ఏపీ 3 టీఎంసీలు కోరుతోంది. ఎవరికి ఎలాంటి కేటాయింపులు జరపాలన్నా సాగర్‌లో ప్రస్తు తం ఉన్న నీటిమట్టం 501అడుగులు, శ్రీశైలం లో 775 అడుగుల దిగువకు వెళ్లాల్సి ఉంటుం ది. అయితే నీటి మట్టాల విషయంలో ఇరు రాష్ట్రాలు మొండిగా వ్యవహరిస్తుండటంతో బోర్డు నిర్ణయం కీలకం కానుంది. మొదటి విడతలో ఏర్పాటు చేయనున్న 18 టెలిమెట్రీ పరికరాల అమలుపై, ఏపీ పరిధిలోని పోతి రెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ దిగువన టెలిమె ట్రీ ఏర్పాటుపై చర్చ జరగవచ్చు.