
ఈ–డిజిటల్ సేవ కార్యాలయానికి కలెక్టరేట్ నుంచి వచ్చిన కొత్త కూలర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సొంత పనిపై వచ్చాడు... పరిస్థితి చూసి చలించిపోయాడు... అంతే ఏ మాత్రం ఆలోచించలేదు... తన జేబులోంచి సెల్‌ఫోన్ తీసి ట్విట్టర్ మెస్సేజ్‌లకు వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. తరువాత పరిస్థితి తెలిసిందే.... అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సౌకర్యాలు సమకూర్చారు. అసలు విషయంలోకి వెళితే... మంచిర్యాల మునిసిపాలిటీ కార్యాలయం ఆవరణలోని ‘ఈ–డిజిటల్’ సేవ కార్యాలయం నిత్యం వివిధ సేవల కోసం వచ్చే సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఇటీవల ఓ యువకుడు తనకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ–డిజిటల్ సేవా కార్యాలయానికి వచ్చాడు. దాదాపు గంట వరకు వరసలో ఉండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... ఇక్కడే అసలు విషయం జరిగింది. గంట సమయంలో ఆ యువకుడు కార్యాలయంలో పలు సమస్యలు గుర్తించాడు. ఫ్యాన్‌లు తిరగక పోవడం, ట్యూబ్‌లైట్‌లు పని చేయక పోవడం గమనించాడు.
సిబ్బంది కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి బాధేసింది. అంతే వెంటనే ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌కు తన మోబైల్ నుంచి మంచిర్యాల ఈ– డిజిటల్ పరిస్థితిని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు ఫోన్ చేసి ఈ–డిజిటల్ సేవలోని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ కర్ణన్ పరిస్థితిని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధరకు తెలియజేసి... వారితో కలిసి కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కర్ణన్ వెంటనే ఈ–డిజిటల్ కార్యాలయానికి కొత్త కూలర్ మంజూరు చేయించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వసుంధర కార్యాలయంలో ట్యూబ్‌లైట్‌లు ఏర్పాటు చేయించారు. ఫ్యాన్‌లు మరమ్మతులు చేయించి అవసరమైతే కొత్త ఫ్యాన్‌లు ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ద్వారా సమకూరిన సౌకర్యాలకు డిజిటల్ కార్యాలయం సిబ్బందితో పాటు సందర్శకులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే... మంత్రికి ట్వీట్ చేసిన ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలియకపోవడం కొసమెరుపు.