
బాబుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది
- వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై ఈ ఐదు నెలల్లోనే ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ధర్నాలు విజయవంతమవడమే ఇందుకు నిదర్శనమని తెలి పారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల నిరసన వెల్లువెత్తిందన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు చేసి ప్రభుత్వంపై నిరసనను తెలియజేశారని వివరించారు. రుణాల మాఫీ జరగకపోవడంవల్ల నష్టపోతున్న రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, మరమగ్గాల వారు, పింఛన్ల తొలగింపునకు గురైన నిరుపేదలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీల్లో, ధర్నాల్లో పాల్గొన్నారని వివరించారు. మొత్తం 663 మండలాల్లో ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు జరి గాయని, ఆ తరువాత అధికారులకు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. బుధవారంనాటి ధర్నాలు ఒక హెచ్చరిక మాత్రమేనని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఇది వంచన, ప్రజాద్రోహం కాదా!
అనంతపురం జిల్లాలో 2012లో పాదయాత్ర చేసినప్పుడు రుణాలు, వడ్డీలు చెల్లించవద్దని రైతులు, మహిళలకు బాబు చెప్పారని.. అధికారంలోకి వచ్చాక కాలం వెళ్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పేద అరుపులు అరవడం వంచన, ద్రోహం కాదా అని ప్రశ్నించారు.