
మంగళవారం బీజే పీ ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగిస్తున్న లక్ష్మణ్. చిత్రంలో బద్దం బాల్‌రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు నేటి తరానికి, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో మంగళవారం వాజ్‌పేయి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన వ్యక్తిగా వాజ్‌పేయి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
సిద్ధాంతాలతో రాజీ పడకుండా, అధికారం కోసం అర్రులు చాచకుండా దేశానికి, ప్రజలకు సేవలందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారం కోసం విలువలకు తిలోదకాలు ఇచ్చి, పార్టీలు మారే ప్రస్తుత నాయకులకు వాజ్‌పేయికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టకుండా ఒక్క ఓటుతో అధికారానికి దూరమై ప్రజల్లోకి వెళ్లిన గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని కితాబిచ్చారు. అలాంటి విలువలతో కూడిన రాజకీయాలను నడపాల్సిన అవసరం ప్రస్తుతం ఉందన్నారు.
తెలంగాణలో అధికార పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫిరాయింపులను ప్రోత్స హించిన టీఆర్‌ఎస్ తీరును ఆయన తప్పుబట్టారు. ఫలితాలు వచ్చినప్పటికీ గెలిచిన శాసనసభ్యులతో ప్రమా ణ స్వీకారం చేయించకపోవడం, మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం వంటి వి కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలిచాయన్నారు. దేశహితమే ప్రధానంగా పనిచేసిన వ్యక్తి వాజ్‌పేయి అని మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు దేశహితం కంటే తమ స్వార్థ రాజకీయాలే ముఖ్యంగా భావించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, యెడ్ల గీత, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.