ఒక్క ఓటుతో లక్ష్మీనారాయణ విజయం
- అన్నీ తామై నడిపించిన ఎంపీ, ఎమ్మెల్యే
- ఒక్క ఓటుతో లక్ష్మీనారాయణ విజయం
యైటింక్లయిన్‌కాలనీ : పక్కా ప్రణాళికతో వ్యూహాన్ని అమలు పర్చి రామగుండం కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగిరేలా చేశారు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. పార్టీ కార్పొరేటర్లు తక్కువ సంఖ్యలోనే గెలుపొందినా... ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టి ఎక్కడా పట్టు జారకుండా జాగ్రత్తపడ్డారు. పథకం ప్రకారం టీఆర్‌ఎస్, ఇండిపెండెంట్లు, బీజేపీ కార్పొరేటర్లను కమాన్‌పూర్ మండలం జూల పల్లి గ్రామ ఆదర్శనగర్‌లోని సానా క్యాంపస్‌లోకి తరలించారు.
ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సత్యనారాయణ క్యాంపునకు ముందుగానే చేరుకుని వ్యూహం రచించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలం సమానంగా ఉన్నా... ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లతో ఓడిపోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, జరగబోయే పరిణామాలను అంచనావేసి కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అందరూ కొంకటి లక్ష్మీనారాయణకు మద్దతు పలికేలా ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక బస్సులో వారిని గోదావరిఖని తీసుకెళ్లారు. ఎన్నిక సమయంలో ఒక టీఆర్‌ఎస్ కార్పొరేటర్ గైర్హాజరై ఉత్కంఠ పరిస్థితి నెలకొనగా ఎంపీ, ఎమ్మెల్యేల ఓటుతో లక్ష్మీనారాయణ విజయం సాధించారు. ఒక్కఓటు తేడాతో మేయర్ పదవి దక్కించుకున్నారు.