మరికొన్ని ప్రాజెక్టులకు లీకేజీ ముప్పు! | Leakage Threat to Palamuru Irrigation Projects | Sakshi
Sakshi News home page

మరికొన్ని ప్రాజెక్టులకు లీకేజీ ముప్పు!

Published Thu, Jan 2 2020 2:43 AM | Last Updated on Thu, Jan 2 2020 2:55 AM

Leakage Threat to Palamuru Irrigation Projects - Sakshi

సరళాసాగర్‌ ప్రాజెక్టుకి గండి పడిన దృశ్యం (ఫైల్‌ ఫోటో)

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మరికొన్ని ప్రాజెక్టులకు కూడా లీకేజీ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కర్ణాటకలో కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదలతో నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టుల కట్టలు ఎప్పుడు తెగుతాయో అనే భయం ఆయా ప్రాంతాల ప్రజలను, అధికారులను వెంటాడుతోంది. సరళాసాగర్‌ ప్రాజెక్టు కట్టకు గండి పడడంతో ఉలిక్కిపడ్డ ఇరిగేషన్‌ శాఖ అధికారులు అలాంటి సమస్యలున్న ప్రాజెక్టులు, చెరువులపై దృష్టి సారించారు. ప్రియదర్శిని జూరాల, దేవరకద్ర ప్రాజెక్టులతో పాటు పలు సాగునీటి కాలువలు, చెరువులకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

ఏటా వేసవిలోనే చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల కట్టలు, గేట్లను పరిశీలించి కాలువ కట్టల మరమ్మతు, తూముల నిర్వహణ, పూడికతీత పను లు చేపట్టాల్సి ఉంటుంది. అయితే రెండేళ్ల నుండి నిధులు లేవని.. అందుకే మరమ్మతు చేపట్టలేకపోతున్నామని ఇరిగేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆధ్వర్యం లో సాంకేతిక సిబ్బందితో కూడిన ప్రాజెక్టు భద్రతా కమిటీ జూరాల ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. జూరాలకు పదిహేనేళ్ల నుంచి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు గేట్లకు తప్పు ఏర్పడింది. జూరాల గేట్లకు సమస్య వస్తే.. ఈ ప్రాజెక్టు కింద ఉన్న నెట్టెంపాడు, భీమా–1, 2, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా వాటి పరిధిలో ఉన్న మరో ఐదు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటి సమస్య వస్తుంది.

జూరాల ఇలా..


వరదల కారణంగా దెబ్బతిన్న జూరాల కరకట్ట
కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టుకూ ముప్పుపొంచి ఉంది. ఉమ్మడి జిల్లా అంతటికీ వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టును 1984లో బహుళార్థ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో జూరాల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు షట్టర్ల సమీపంలోని కరకట్ట మొన్నటి వరదల కారణంగా పూర్తిస్థాయిలో దెబ్బతింది. పుష్కరఘాట్లతో పాటు ఏర్పాటుచేసిన కరకట్ట కూడా నీటి ప్రవాహానికి కూలిపోయింది. వీటిని అధికారులు గుర్తించినా ఇప్పటివరకు మరమ్మతు చేసే ప్రయత్నాలు కూడా చేపట్టక పోవడంతో భవిష్యత్తులో మళ్లీ వరదలు వస్తే కరకట్ట పూర్తిగా కొట్టుకపోయి ప్రాజెక్టు దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.  

కోయిల్‌సాగర్‌..


కోయిల్‌సాగర్‌ గేటు నుంచి నీటి లీకేజీ
దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకూ లీకేజీ ముప్పు ఉంది. ప్రాజెక్టుకు 13 గేట్లు ఉండగా.. రెండు గేట్ల కింది భాగం నుంచి నీరు మెల్లగా లీకేజీ అవుతోంది. గతేడాది ప్రాజెక్టు గేట్లకు కింది భాగంలో కొత్త వాచర్లు వేసిన తరువాత లీకేజీ సమస్య కాస్త తీరింది. అయినా కొన్ని చోట్ల లీకేజీ అవుతూ నీరు వృథాగా పోతోంది. మరోపక్క.. ఏడు దశాబ్దాల క్రితం గచ్చురాయితో నిర్మించిన ప్రాజెక్టు అలుగు నుంచి నీటితడి బయటకు వస్తోంది. ప్రమాదం జరగక ముందే అలుగును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇటు డ్యామ్‌ కట్ట సైతం పలు చోట్ల కోతకు గురైంది. ప్రాజెక్టులోకి వెళ్లే మెట్లు ధ్వంసమై ఏడాది దాటినా ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 31.3 అడుగుల వరకు నీరుంది. ఇదిలా ఉండగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రాజెక్టు గేట్లు, కట్టకు ఎలాంటి మరమ్మతు చేపట్టలేదు. డ్యామ్‌ కట్టపై ఉండే ప్లాట్‌ఫాం సైతం మరమ్మతు లేక మట్టి కొట్టుకుపోయింది.

శిథిలావస్థలో ఆర్డీఎస్‌ కాల్వ..


డి–25 సమీపంలో కోతకు గురైన ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వ   
వడ్డేపల్లి మండల పరిధిలోని ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వ డిస్ట్రిబ్యూటరీ 24 నుంచి 28 వరకు శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల క్రితం కెనాల్‌కు ఇరువైపులా అతికించిన సిమెంట్‌ బిల్లలు శిథిలమై కాలువ కోతకు గురవుతోంది. ఈ ఏడాది సెపె్టంబర్‌లో కాలువకు గండి పడింది. మూడు రోజుల పాటు సాగునీరందక రైతులు ఆందోళన చెందారు.

కేఎల్‌ఐ..


కేఎల్‌ఐ 10వ కి.మీ. వద్ద సిమెంటు దిమ్మె భాగంలో కొట్టుకుపోయిన మట్టి
రైతులకు వరప్రదాయిని అయిన మహాత్మాగాంధీ లిఫ్టు ఇరిగేషన్‌ (ఎంజీ కేఎల్‌ఐ) ప్రాజెక్టు కాలువలు నాణ్యతా లోపాలతో కోతలకు గురవుతున్నాయి. గుడిపల్లి రిజర్వాయర్‌ నుంచి అచ్చం పేట వరకు 90కి.మీ. దూరం ప్రవహించే బ్రాంచ్‌ కెనాల్‌ నాణ్యతా లోపంతో అక్కడక్కడ కోతకు గురైంది. అదే కాల్వను అనుసరించి ఏర్పాటు చేసిన సబ్‌ కెనాల్‌ సైతం అక్కడక్కడ కోతకు గురైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement