‘పాలమూరు’ పైపైకి! | palamuru project construction cost increases | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ పైపైకి!

Published Mon, Aug 1 2016 1:34 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

‘పాలమూరు’ పైపైకి! - Sakshi

‘పాలమూరు’ పైపైకి!

తాజా అంచనా రూ. 50,985 కోట్లు
ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం రూ.35,200 కోట్లు
గతంలో రూ. 47,650 కోట్లకు సవరించిన నీటి పారుదల శాఖ
మరోసారి సవరించి రూ. 3,335 కోట్లు పెంచిన అధికారులు
ప్రాజెక్టు వ్యయంలో మొత్తంగా రూ.15,785 కోట్ల పెరుగుదల

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న మార్పుచేర్పులకు తోడు కొత్తగా తోడవుతున్న అదనపు నిర్మాణాల వల్ల అంచనా వ్యయం అమాంతం పైకి ఎగబాకుతోంది. ప్రాజెక్టు తొలి అంచనా రూ.35,200 కోట్లు కాగా, ప్రస్తుత అంచనాతో అది ఏకంగా రూ.50,985 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు వాస్తవ వ్యయంతో పోలిస్తే రూ.15,785 కోట్ల మేర వ్యయం పెరిగింది. నీటిని తీసుకునే సామర్థ్యం 1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీలకు పెంచడంతో జరిగిన మార్పులతోనే ఏకంగా రూ.5,438 కోట్ల మేర వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది.
 
భారీగా పెరుగుతున్న వ్యయం..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్ల అంచనాతో  ప్రభుత్వం చేపట్టింది. తొలి డిజైన్ ప్రకారం దీని ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీల వరద జలాలను తీసుకొని 10 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించింది. అయితే తర్వాత ఈ సామర్థ్యాన్ని 2 టీఎంసీలకు పెంచాంది. అలాగే ఆయకట్టును 10 లక్షల నుంచి 12.3 లక్షల ఎకరాలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే అంచనా వ్యయం రూ.47,650 కోట్ల మేరకు పెరుగుతుందని అధికారులు నెల రోజుల కింద అంచనా వేశారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న మరిన్ని మార్పుల వల్ల తాజా అంచనా వ్యయం రూ.50,985 కోట్లకు పెరిగింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే అంచనా రూ.3,335 కోట్లు పెరిగినట్లయింది.
 
వ్యయం పెరిగింది ఇలా..

ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీటిని తీసుకోవాల్సి రావడంతో 8 పంపులు అదనంగా అవసరమవుతున్నాయి. ఇందుకు మరో 1,250 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. వీటికోసం ముందుగా నిర్ణయించిన సబ్‌స్టేషన్లకు తోడు అదనంగా 400 కేవీ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మించాల్సి రావడంతో ఈ పనులకు డీపీఆర్ ప్రకారం అంచనా రూ.10,335 కోట్ల నుంచి రూ.15,773.35 కోట్లకు పెరిగింది. ఈ మార్పులకు అనుగుణంగా అప్రోచ్ చానల్, ఏపెన్ చానల్ మార్పుల కారణంగా వాస్తవ వ్యయం రూ.1,860 కోట్ల నుంచి రూ.2,197 కోట్లకు పెరిగింది. మొదటి మూడు స్టేజీల్లో వాస్తవ ప్రతిపాదన ప్రకారం ఒక టన్నెల్ నిర్మాణమే ఉండగా, ప్రస్తుతం జంట టన్నెళ్ల అవసరం ఉంటోంది.

దీంతో ఇక్కడ రూ.3,894.41కోట్ల నుంచి అంచనా వ్యయం రూ.5,313.56 కోట్లకు ఎగబాకింది. దీనికి తోడు కొత్తగా 16 టీఎంసీలతో అంతారం, 4.92 టీఎంసీలతో హేమ సముద్రం ఆఫ్‌లైన్ రిజర్వాయర్‌లు ప్రతిపాదించడంతో కొత్తగా రూ.2,617.86 కోట్ల వ్యయం తోడయింది. రిజర్వాయర్ బండ్‌ల పొడవును పెంచడంతో వ్యయం రూ.9,488 కోట్ల నుంచి రూ.10,624 కోట్లకు పెరగగా, ఆయకట్టు పెంపుతో మెయిన్ కెనాల్ పనులు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణంతో రూ.4,250 కోట్ల నుంచి రూ.5,227.50 కోట్లకు పెరిగింది. సవరించిన స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల కారణంగా వ్యయం రూ.1,090 కోట్ల మేర పెరగగా, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ వంటి కారణాలతో రూ.2,700 కోట్ల మేర పెరిగింది. అయితే మరికొన్ని మార్పులు జరిగే ఆస్కారం ఉన్న దృష్ట్యా అన్నీ పూర్తయ్యాకే మొత్తంగా పెరిగిన అంచనాలను ఒకేసారి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement