కుల వివక్ష వీడిన ఎల్గోయి.. వెలుగోయి | Left and caste discrimination | Sakshi
Sakshi News home page

కుల వివక్ష వీడిన ఎల్గోయి.. వెలుగోయి

Published Sun, May 31 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

Left and caste discrimination

కులం చెదిరింది.. స్నేహం కుదిరింది నాడు కత్తులు దూసిండ్రు..
నేడు మిత్రులవుతుండ్రు ‘సాక్షి’ చిరు ప్రయత్నం..
నేడు గ్రామంలో వివాహం అందరికీ అందిన శుభలేఖలు

 
సంగారెడ్డి: నిండు వేసవిలోనూ నిగనిగలాడే హరిత వనాల్లాంటి చెరుకు తోటలు.. వాటి నడుమ చుట్టూ ఏడూళ్ల శివార్లతో సరిహద్దు.. తెలగ, దళిత, లింగాయత్, బీసీ సబ్బండ జాతులు కలగలిసిన జీవనం.. వ్యవసాయమే జీవితం. రెక్కల కష్టమే జీవనాధారం. బాంధవ్యం, బంధుత్వమే వాళ్ల బలం. అలాంటి పల్లెలో కులం చిచ్చు రేగింది. దళితులు ‘ఆత్మగౌరవం’ కావాలంటే మరో సామాజిక వర్గం ‘అవమానం’గా భావించింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న వాళ్లు వైరి వర్గాలయ్యారు. కుల కట్టుబాట్లు పుట్టుకొచ్చాయి. కుల సంఘాలు చొచ్చుకొచ్చాయి. ఠాణా వరకు వెళ్లారు. పచ్చగా బతికిన పల్లె జనం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కులం కొలిమిలో మాడుతున్న ఆ పల్లె పేరు ఎల్గోయి. కత్తులు దూసుకున్న ఆ పల్లెలో ఇప్పుడిప్పుడే మళ్లీ పాత స్నేహం చిగురేస్తోంది. మునుపటి ఆప్యాయతను, అనురాగాన్ని పంచుకునేందుకు తొలి అడుగు వేస్తోంది.
 
ఊరి జనం కుల బంధనాల్లోంచి బయటికి రాబోతున్నారు. వైరి వర్గాలను కలపడం కోసం ‘సాక్షి’ ఓ చిరు ప్రయత్నం చేసింది. శనివారం గ్రామంలోని ముఖ్యులను ఒకచోట కలిపింది. పెద్దలంతా కలిసి మనుసు విప్పి మాట్లాడుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ గొప్పతనాన్ని గుర్తించారు.. దళితుల నిర్ణయాన్ని స్వాగతించారు. ఆదివారం జరిగే  తన కొడుకు పెళ్లికి రమ్మని కొత్తదొడ్డి రామన్న ఊరు ఊరంతా ‘శుభలేఖ’లు ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కూడా వీరి మైత్రికి తోడ్పడిందనే చెప్పాలి..
 
 ఇదీ నేపధ్యం..
 ఎల్గోయి గ్రామానికి చెందిన దళితులు.. సమాధుల కోసం బొందలు తీయడం ఆత్మగౌరవ సమస్యగా మారిందని, ఇకపై శవాలను ఖననం చేయడానికి బొందలు తీయకూడదని తీర్మానించుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన కొన్ని సామాజిక వర్గాలు వ్యవసాయ పనుల్లో దళితులను తీసుకోకూడదని, వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రతి తీర్మానం చేశాయి. 15 రోజుల పాటు కట్టుబా ట్లు రాజ్యమేలాయి. అది గొడవలకు దారి తీసింది. క్రమంగా విషయం బయటికి పొక్కడంతో మీడి యా, కుల సంఘాలు దళితులకు అండగా నిలబడ్డా యి. పోలీసులు రంగంలోకి దిగారు. దళితులు తమను వ్యతిరేకించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారు. కేసు విచారణ దశలో ఉంది.
 
 ఎంతో కోల్పోయారు..
 పల్లెలో కులం చిచ్చు రేగి నెల గడిచింది. వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టుబాట్లతో చెరకు తోటల్లో కలుపుతీత పనులు నిలిచిపోవడంతో కలుపు మొక్కలు పెరిగాయి. ఇక పోలీసుస్టేషన్లు, నేతల రాకపోకలతో ఖర్చేగానీ రూపాయి కూడా ఆదాయం లేకుండా పోయింది. అన్నింటికి మించి పొద్దున లేచింది మొదలు ఇప్పటి దాకా  ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ  పనుల్లో ఇచ్చిపుచ్చుకుంటూ ఒకే కుటుంబంగా కలసి బతికిన ప్రజలు.. ఇప్పుడు ఎడ ముఖం పెడముఖంగా బతికారు.
 
 మనసు మారిందిలా..
 నిజానికి ఒక గ్రామ ప్రముఖుని ఇంట్లో నెల కిందట జరిగిన వివాహ మహోత్సవంలో దళితులకు అవమానం జరిగింది. దళితులు వాయించే బాజాభజంత్రీలను తప్పని పరిస్థితుల్లో వెనక్కి పంపించారు. కాలం గడిస్తున్న కొద్ది మిగిలిన సామాజిక వర్గాలు కూడా తమ తప్పును తెలుసుకున్నాయి. దళితుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనని, మునుపటిలాగా కలసిమెలిసి ఉండాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంతోనే  ఒక అభిప్రాయానికి వచ్చారు.  ఈ నేపథ్యంలో కొత్తదొడ్డి రామన్న తన కొడుకు వివాహానికి ఊరునంతా ఆహ్వానించారు. కుల గొడవలు పక్కనపెట్టి  ఇంటింటికి పెళ్లి శుభలేఖలు ఇచ్చారు. సుమారు 2 వేల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెళ్లికి తామంతా వెళ్తామని, కులమతాలకు అతీతంగా కొత్త దంపతులను ఆశీర్వదిస్తామని ఎంపీటీసీ మల్లికార్జున్ పటేల్, సర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచులు బాబూమియా, నర్సింహులు ‘సాక్షి’ ప్రతినిధితో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
 
 అంతరమే పంచాయితీకి ఓ కారణం
 గ్రామంలో మొత్తం 120 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో  22 కుటుంబాలకు అసలు భూమి లేదు. ఒక ఎకరా...అర్ధ ఎకరా భూమి కలిగి ఉన్న వాళ్లు 32 కుటుంబాలు ఉన్నాయి. మరి కొన్ని కుటుంబాలకు ఊరుకు తూర్పు భాగంలో ఉన్న సర్వే నెంబర్ 125, 54 ల్లో దాదాపు 75 మందికి భూములు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. పైగా  నీళ్లు లేక భూమి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో దళితులు వాటిని సాగుచేయడం లేదు. మరో వైపు ఊరు ఉత్తరం దిక్కున ఎక్కువగా ఇతర సామాజిక వర్గానికి చెందిన భూములున్నాయి.ఈ భూముల్లో నీటి సౌకర్యం ఉండటంతో మూడు కాలాల్లో కూడా పంటలు పండుతాయి. వీళ్ల భూముల్లోనే దళితులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. ఉన్నఫలంగా దళితులను వ్యవసాయ పనుల్లోకి రాకుండా అడ్డుకోవడంతో వారు ఇందోళన చెంది తిరుగుబాటు చేశారు. ‘దళితులకు ప్రభుత్వం చెప్పినట్టుగా భూ పంపిణీ చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.  మా పిల్లలకు ప్రభుత్వం ఇతరులతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇచ్చి నీటి వసతి కల్పించాలి’ అని దళిత నాయకుడు తలారి వీరన్న చెప్పడం వారి  ఆకాంక్షకు అద్దం పడుతోంది.  
 
 అభివృద్ధి లేని పల్లె....
 పల్లెలో స్వయం జీవన విధానమే కనిపించింది. దాదాపు 2,400 ఓట్లు ఉన్న గ్రామంలో కనీస వసతులు మాత్రం ఏమీ లేవు. 3,500 ఎకరాల సాగు భూమి  ఉన్నప్పటికీ సేద్యానికి పనికి వస్తున్నది కేవలం 2వేల ఎకరాలకు మించదు. దళిత, బీసీ కాలనీలు మట్టి రోడ్లతోనే ఉన్నాయి. కొద్దిపాటి చినుకులు రాలినా  బజార్లు అన్ని గుంతలు పడి నడవటానికి వీలులేకుండా మారుతాయి. ఎస్సీ కాలనీలో 7,300 మీటర్ల పొడవైన సీసీ రోడ్డు, బీసీ కాలనీలో కనీసం 6వేల మీటర్ల సీసీ రోడ్డు అవసరం ఉన్నాయి. సీసీ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయా ప్రతిపాదనలకు అనుమతి రాలేదు.   గ్రామంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది.  ఆర్‌ఓఆర్ వాట ర్ ఫిల్టర్ యంత్రాలను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
 
 అనుకోకుండా జరిగిపోయింది
 తాము అంతా కలసి మెలిసి ఉన్న వాళ్లమే. గ్రామంలో ఎక్కువతక్కువ కులం అనే అభిప్రాయభేదాలు లేవు. మొన్న జరిగిన సంఘటన ఒక పీడకల. అందరం కలసి పోవాలే. ఎప్పటిలాగే అన్ని శుభకార్యాలు కలసే చేసుకోవాలే.
 - బాబూమియా, మాజీ సర్పంచ్
 
 ఈ నెల రోజులు చాలా కోల్పోయాం
 ఈ గొడవలతో చాలా కోల్పోయాం. వాళ్లు మేము ఎప్పుడూ ఎదురుపడి గొడవపడింది లేదు. పొలంలో కలుపు పెరిగిపోయింది. ఎన్‌ఆర్‌జీఎస్ పనులు ఆగిపోయాయి. ఒక రకంగా గ్రామం అభివృద్ధి ఆగిపోయింది.
 - జగన్నాథరెడ్డి రైతు
 
 నూతన జంటను ఆశీర్వదిస్తాం
 రామన్న ఇంటి పెళ్లికి మేం అంతా వెళ్తాం. నవ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వస్తాం. గతంలో మేం అంతా కలిసి ఉన్న వాళ్లమే. అనుకోకుండా జరిగిన సంఘటన మమ్ములను ఇబ్బంది పెడుతోంది.
 -  మల్లికార్జున్ పటేల్, ఎంపీటీసీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement