12 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స  | List Of Coronavirus Treatment Hospitals In Telangana | Sakshi
Sakshi News home page

12 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స 

Published Tue, Mar 31 2020 2:35 AM | Last Updated on Tue, Mar 31 2020 2:35 AM

List Of Coronavirus Treatment Hospitals In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు తెలంగాణ సర్కారు అన్ని రకాలుగా సిద్ధమైంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో 12 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేష్‌రెడ్డి సోమవారం అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌లో 9, వరంగల్‌లో 2, రంగారెడ్డిలో ఒక ఆసుపత్రి కరోనా కోసం ప్రత్యేకంగా పనిచేస్తాయి. వీటిలో ఇతర రోగులకు చికిత్స చేయరు. ఆయా ఆసుపత్రుల్లో 4,177 ఐసోలేషన్, 600 ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. ఇవికాక, మిగతా జిల్లాల్లోని జిల్లా ఆసుపత్రులతో కలిపి మొత్తం 12 వేల పడకలను అందుబాటులోకి తెస్తారు. అలాగే కరోనాకు చికిత్స అందించే డాక్టర్లకు అవసరమైన సలహా సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిప్‌మార్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఎక్కడెక్కడ ఏయే జిల్లాల నిర్ధారణ పరీక్షలంటే..
► గాంధీ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీలు, ఫీవర్‌ ఆసుపత్రి, నిమ్స్‌.. ఈ నాలుగుచోట్లా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏయే జిల్లాల నమూనాలు పరీక్ష కేంద్రానికి పంపాలనేది కూడా సర్క్యులర్‌లో స్పష్టంచేశారు. 
► ఉస్మానియా మెడికల్‌ కాలేజీ: కింగ్‌కోఠి, ఛాతీ ఆసుపత్రి, సరోజిని కంటి ఆసుపత్రి, వరంగల్‌ ఎంజీఎం నుంచి శాంపిళ్లు ఇక్కడకు వెళ్తాయి. ఇంకా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి వచ్చే శాంపిళ్లనన్నింటినీ ఈ కాలేజీకి పంపిస్తారు.
► ఫీవర్‌ ఆసుపత్రి: ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్‌క్యూర్, నిజామియా జనరల్‌ ఆసుపత్రి, రామంతాపూర్‌ హోమియో ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను ఇక్కడకు పంపించాలి. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, జనగాం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, భూపాలపల్లి, మహబూబ్‌ నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల శాంపిళ్లను కూడా ఇదే ఆసుపత్రిలో పరీక్షిస్తారు.
► గాంధీ ఆసుపత్రి: ఇక్కడికి నేరుగా వచ్చే కేసులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల శాంపిళ్లను ఇక్కడ పరీక్షిస్తారు.
► నిమ్స్‌: గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను పరీక్షిస్తారు.

12 ఆసుపత్రులు.. పడకల వివరాలు
ఆసుపత్రి పేరు                                           పడకల సంఖ్య
► హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆసుపత్రి                   350
► గాంధీ ఆసుపత్రి                                      1,500
► ఛాతీ ఆసుపత్రి                                        130
► సరోజినీదేవి కంటి ఆసుపత్రి                        200
► ఫీవర్‌ ఆసుపత్రి                                       82
► బేగంపేటలోని నేచర్‌ క్యూర్‌                         250
► చార్మినార్‌ నిజామియా జనరల్‌ ఆసుపత్రి       200
► ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి                      200
► రామంతాపూర్‌ హోమియో ఆసుపత్రి           90
► గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌                         1,500
► వరంగల్‌ ఎంజీఎం                                    175
► వరంగల్‌ ఆయుర్వేద బోధనాసుపత్రి             100 

అన్ని జిల్లాలకు 74 అంబులెన్సులు
కరోనా రోగులను తరలించేందుకు, అవసరమైన వారు కరోనా ఆసుపత్రులకు చేరేందుకు 74 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయో కూడా లొకేషన్‌ సహా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర కలిగినవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారు, ఒకవేళ పాజిటివ్‌ కేసున్నా ఈ అంబులెన్సులకు ఫోన్‌చేసి రప్పించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement