‘లోక్‌పాల్’ అమలు కోసం త్వరలో దీక్ష
- ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వెల్లడి
హైదరాబాద్: లోక్‌పాల్ చట్టం సత్వర అమలు కోసం మరో పోరాటం చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు, గాంధేయవాది అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘపోరాటం అనంతరం మునుపటి యూపీఏ ప్రభుత్వం చేసిన లోక్‌పాల్ చట్టం అమలుపై ప్రస్తుత సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
శనివారం హైదరాబాద్ వనస్థలిపురంలో చెరుకూరి గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామారావు ఆధ్వర్యంలో ‘సాయి దేశం- గాంధీ మార్గం’ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఛత్రపతి శివాజీ గ్రౌండ్‌లో జరిగిన సభలో పాల్గొని యువత, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సమాజమే ఒక కుటుంబంగా భావించి, అందరితో కలసిమెలసి జీవిస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని అన్నారు.
ప్రతి ఒక్కరూ తాను బతుకుతూ సమాజాన్ని బతికించాలన్న స్వామి వివేకానందుని మాటలను పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ గాంధేయ మార్గంలో పయనించి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సేవకులు రంగయ్య గౌడ్, సంజయ్‌కుమార్, డాక్టర్ సురేశ్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహెబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.