
అమ్మ యంగ్ ఇండియా అవార్డు గ్రహీతలలో 'సాక్షి' దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి
* ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి పిలుపు
* సాక్షి టీవీ జర్నలిస్టు స్వప్నకు యంగ్ ఇండియా అవార్డు
సాక్షి, చెన్నై: తెలుగు, తమిళం అన్న భేదాలు లేకుండా భాషలన్నింటినీ ప్రతి ఒక్కరూ ప్రేమించాలని ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి పిలుపునిచ్చారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చెన్నైలోని రాణి సీతై హాల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరిట అమ్మ యంగ్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. జయలలిత 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిలీప్ రెడ్డి, అపోలో ఆస్పత్రి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి హాజరై అవార్డులను ప్రదానం చేశారు. సినీ, మీడియా, స్వచ్ఛంద, సామాజిక, క్రీడా రంగాల్లో రాణిస్తున్న మహిళలకు గుర్తింపునిస్తూ ఈ అవార్డులను ప్రదానం చేశారు. సినీ రంగంలో నటి కాజల్ అగర్వాల్‌కు యంగ్ ఇండియా (స్పెషల్ అవార్డు) అవార్డును ప్రకటించారు.
అయితే, ఆమె రాలేని కారణంగా ముందుగానే అవార్డును అందజేశారు. సినీ తారలు విమలారామన్, మధుషాలినీ, అక్ష పర్వసాని, షాలినీ నాయుడులకు, జర్నలిజం కేటగిరిలో స్వప్న (సాక్షి టీవీ), కాజల్ అయ్యర్ (టైమ్స్ నౌ ), మేగా మామ్‌గైన్( సీఎన్‌ఎన్‌ఐబీఎన్), కత్తి కార్తిక (వి 6), దీప్తి వాజ్‌పేయి (టీవీ-9), పబ్లిక్ సర్వీస్ కేటగిరిలో ఆదాయ పన్ను శాఖ అధికారిని జె.ఎం.జమునాదేవి (ఐఆర్‌ఎస్), సోషల్‌సర్వీస్ కేటగిరిలో అశ్విని అంగాడి (సోషల్ వర్కర్), స్పోర్ట్స్ కేటగిరిలో శైలజ (క్రికెటర్), ఔత్సాహిక ప్రతిభ కేటగిరిలో వీణా ఘంటసాల, తంతి టీవీ జర్నలిస్టు శాంతికి ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ..భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. ఎక్కడ మహిళలు గౌరవం పొందుతారో అక్కడ దేవతలు ఉంటారని పేర్కొన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రసంగిస్తూ.. తమిళనాడులోని తెలుగు వారికి ఏపీ, తెలంగాణలోని తెలుగు వారు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.