సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగసభ రాష్ట్రంలో రాజకీయ మార్పులకు శ్రీకారం చుడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా దేశ రక్షణకు సంబంధించి, ప్రధానిగా ఎవరుండాలనే దానిపై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలివి అని పేర్కొన్నారు. ఎల్‌బీ స్టేడియంలో మోదీ సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్ట్‌లు కాపాడుకుంటూ తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ మంచి సంఖ్యలో సీట్లు గెలుచుకుని, ఓట్ల శాతాన్ని కూడా పెంచుకుంటుందన్నారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయపార్టీగా బీజేపీ రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు దీటైన ప్రతిపక్షం బీజేపీ అనే విషయం రుజువు కాబోతోందన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్ ప్రలోభాలకు లొంగిపోయారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీమంత్రి విజయరామారావు, ఇతర నేతలు మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఇతర హేమాహేమీలు బీజేపీలో చేరారంటేనే మారుతున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని అన్నారు. మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు హిందువులను కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉగ్రవాది మసూద్ మీద ఉన్న నమ్మకం భారత సైనికుల మీద లేకపోవడం సిగ్గుచేటని, భారత ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ప్రధాని మోదీ చేపట్టిన ‘మైబీ చౌకీదార్’ లైవ్ కార్యక్రమాన్ని ముషీరాబాద్‌లోని ఎన్నికల కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, ఎన్నికల పరిశీలకులు కృష్ణదాస్, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి తదితరులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా మైబీ చౌకీదార్ ప్లకార్డ్స్‌ను ప్రదర్శించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరువాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులపై కనీస చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ మాత్రం ఉడీ, పుల్వామాలో సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి సమాధానంగా మెరుపు దాడులు జరిపించారని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ ఖ్యాతి తనది కాదని, అది జవాన్లదని.. వారికి తాము స్వేచ్ఛను ఇచ్చామని ప్రధాని ప్రకటించడం ఆయన హుందాతనానికి నిదర్శనమని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment