నల్లగొండ : బ్యాంకు ఉద్యోగినని నమ్మించి ఓ అమయాకురాలి నుంచి రూ. 75 వేలతో ఉడాయించాడో ఆగంతకుడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం చిన్న అడిశర్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న వినోద అనే మహిళ గతంలో ఆంధ్రాబ్యాంక్‌లో బంగారం కుదవ పెట్టి రూ. 2.65 లక్షలు రుణం తీసుకుంది. నగదు చెల్లించేందుకు ఈ రోజు తన నగలను తీసుకెళ్లడానికి బ్యాంకు వెళ్లింది. ఆ సమయంలో బ్యాంకు మూసి ఉండటంతో.. పక్కనే ఉన్న బడ్డీ కొట్లో కూర్చుంది. మాటల మధ్య తాను బ్యాంక్‌లో నగదు జమ చేయడానికి వచ్చానని స్థానికులతో చెప్పింది.
ఆ విషయం విన్న ఆగంతకుడు తాను బ్యాంక్ ఉద్యోగినని.. మేనేజర్ గారు రూ. 75 వేలు ముందు ఇవ్వమన్నారని.. ఆ తర్వాత మిగతా అప్పు రెన్యువల్ చేస్తారని చెప్పాడు. అతని మాటలు నమ్మిన వినోద రూ. 75 వేలను అతని చేతిలో పెట్టింది. వెంటనే అతడు నీ పాస్ పుస్తకాలు జీరాక్స్ తీసుకురమ్మని చెప్పాడు. జిరాక్స్ తీసుకొని బ్యాంక్ వద్దకు వచ్చేసరకే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు.
కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ బ్యాంకు అదికారులకు జరిగిన విషయం చెప్పింది. ఈ విషయంపై తనకు ఏమి తెలియదని బ్యాంకు మేనేజర్ వెల్లడించాడు. దాంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా సీసీ టీవీ ఫూటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.