షాద్‌నగర్ (మహబూబ్ నగర్) : ప్రైజ్ మనీ వచ్చిందని ఓ అమాయకుడిని మోసం చేసి లక్షలు దండుకున్న ఉదంతం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యూసుఫ్‌కు ఇటీవల 92347880001 నంబరు నుంచి ఆకాష్ వర్మ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. 'కంగ్రాచులేషన్స్.. మీకు లక్కీ డిప్‌లో రూ.25 లక్షలు ప్రైజ్ వచ్చింది... ఆ డబ్బు కావాలంటే మేం సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత డబ్బు జమ చేయాల్సి ఉంటుంది' అని చెప్పాడు.
ప్రైజ్ మనీ ఆనందంలో యూసుఫ్ ఆ వ్యక్తి చెప్పినట్టుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతను చెప్పిన సమయం ప్రకారం, తెలియజేసిన వ్యక్తుల పేరుతో రూ.4 లక్షలు జమ చేశాడు. అనంతరం ప్రైజ్‌మనీ ఎంతకీ రాకపోయేసరికి యూసఫ్ పదే పదే ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. చివరికి ఆన్‌లైన్లో ఒక చెక్కును యూసఫ్కు పంపించాడు. అది డూప్లికేట్ చెక్కు అని, ఒరిజినల్ చెక్కు కావాలంటే మరో రూ.1.70 లక్షలు ఖాతాలో జమ చేయాలని ఫోన్ చేశాడు. దీంతో యూసుఫ్ మోసపోయిన విషయం గమనించి శుక్రవారం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.
ప్రైజ్‌మనీ అంటూ రూ.4 లక్షలకు టోపీ
Published Fri, Oct 16 2015 4:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement