అసామాన్యులు | Mandal Parishad President womans mpps in atmakur | Sakshi
Sakshi News home page

అసామాన్యులు

Published Thu, Jul 24 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

అసామాన్యులు

అసామాన్యులు

 అదృష్టం ఏరూపంలో వరిస్తుందో..ఎవరు చెప్పగలరు. రాజయోగం రాసిపెట్టి ఉంటే తనకు కానిది కూడా వశమవుతుందంటారు. అదే మాదిరిగా నిన్న మొన్నటి వరకు సామాన్య మహిళలుగా ఉన్న వారు అస‘మాన్యు’ల య్యారు.. కొందరికి రిజర్వేషన్లతో కాలం కలిసొచ్చింది. మరికొందరిని అదృష్టం వరించింది. ఏదైతేనేం.. నేడు వారంతా మండల పరిషత్ అధ్యక్షులయ్యారు.  వ్యవసాయ కూలీలు.. గృహిణులు.. రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యులకూ అధికారం చేరువైంది. తమ వ్యక్తిగత పనులు చేసుకుంటూనే అధ్యక్షులుగా పరిపాలనపై దృష్టిసారిస్తున్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన వారిపై ప్రత్యేక కథనం..
 
 వ్యవసాయ క్షేత్రం నుంచి..
 ఆత్మకూర్(ఎస్) : కొద్ది రోజుల క్రితం వరకు ఆమె అందరిలాగే సాధారణ గృహిణి. వ్యవసాయ పనుల్లో భర్తకు సాయపడుతూ ఉండేది. నేడు మండల అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుని వీఐపీగా మారింది. ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన కసగాని లక్ష్మీబ్రహ్మయ్య గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది. అయినా నిరుత్సాహానికి గురికాకుండా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసి  గెలుపొందింది. ఎంపీపీ అధ్యక్ష పీఠం బీసీ జనరల్‌కు కేటాయించినా ఆమెకే అదృష్టం వరించడంతో మండల అధ్యక్షురాలిగా ఎన్నికైంది.
 
 వంటింటి నుంచి.. మండల పరిషత్‌కు
 హాలియా : మండల పరిషత్ అధ్యక్షురాలు అల్లి నాగమణి రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె భర్త అల్లి పెద్దిరాజు బోయగూడెం సర్పంచ్‌గా పని చేయడంతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. భర్త క్రీయాశీలక రాజకీయాల్లో ఉండడంతో ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోసం ఇంటికి వచ్చేవారు. దీంతో రాజకీయాలపై కొంత అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలో మండల పరిషత్ అధ్యక్ష స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సీఎల్పీ నేత జానారెడ్డి విజ్ఞప్తి మేరకు గరికేనాటితండ నుంచి నాగమణి పోటీ చేసి ఎంపీటీసీగా గెలుపొందింది. జానారెడ్డి మద్దతు, పార్టీ ఎంపీటీసీల సహకారంతో ఎంపీపీగా పాలన పగ్గాలు చేపట్టింది.
 
 సమభావన సంఘం లీడర్‌గా..
 నూతనకల్ : నూతనకల్ ఎంపీపీగా గెలుపొందిన కాసోజు సుమలత సమభావన సంఘం గ్రూపు లీడర్. గతంలో పెద్దనెమిల గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలిగా కూడా పనిచేసింది. భర్త మదనాచారితో పాటు అత్త గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. కుటుంబ రాజకీయ నేపథ్యం, రాజకీయాలపై ఉన్న ఆసక్తి, ప్రజా సమస్యలపై అవగాహనతో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో పెద్దనెమిల ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందింది.  రిజర్వేషన్లలో భాగంగా మండల పరిషత్ అధ్యక్ష పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఎం సహకారంతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకుంది.
 
 మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు..
 హుజూర్‌నగర్ : మండలంలోని కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన గొట్టెముక్కల నిర్మల హుజూర్‌నగర్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు ఆమె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకురాలిగా పనిచేశారు. విద్యార్హత కేవలం 9వ తరగతి  మాత్రమే. అయినప్పటికీ ఆమెకు అదృష్టం వరించింది. గ్రామ ఎంపీటీసీ, ఎంపీపీ స్థానం కూడా ఎస్సీ మహిళకే కేటాయించడం నిర్మలకు కలిసివచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోగా పార్టీ నుంచి గెలుపొందిన వారిలో నిర్మల మాత్రమే ఎస్సీ మహిళ కావడంతో ఎటువంటి పోటీ లేకుండానే ఎంపీపీగా ఎన్నికైంది.  
 
 కూలి మేస్త్రి నుంచి...
 గరిడేపల్లి : వ్యవసాయ పనులకు కూలీలను తీసుకువచ్చే మహిళా గరిడేపల్లి ఎంపీపీ పీఠాన్ని అధిరోహించింది. భీమపంగు సోమమ్మ కూలీల మేస్త్రిగా సర్వరాంలో ప్రజలందరికీ సుపరిచితురాలే. రాత్రి బడికి వెళ్లి తన పేరు రాయడం నేర్చుకుంది. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సర్వరారం ఎంపీటీసీ స్థానం  ఎస్సీలకు రిజర్వు కావడంతో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచింది. కాగా ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో సోమమ్మ ఒక్కరే ఎస్సీ కావడంతో స్వతంత్ర, సీపీఐ సభ్యుల మద్దతుతో మండల పరిషత్ అధ్యక్షురాలిగా నిలిచింది.
 
 అంచెలంచెలుగా ఎదుగుతూ..
 సంస్థాన్ నారాయణపురం : రిజర్వేషన్లతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళలు పదవీ కాలం ముగిసిన తర్వాత చాలా వరకు ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ పీఠాన్ని అధిరోహించింది వాంకుడోతు బుజ్జి. సీత్యాతండాకు చెందిన బుజ్జి 1996లో రిజర్వేషన్‌లో భాగంగా భర్త శ్రీను ప్రోత్సాహంతో వావిళ్ళపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2002లో సాంఘిక సంక్షేమ రాష్ట్ర డెరైక్టర్ గా, 2006లో జెడ్పీటీసీ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వావిళ్ళపల్లి ఎంపీటీసీ-2 స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటికీ రాజకీయ సమీకరణలతో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది.  
 
 రెండుసార్లు ఓడి.. మూడోసారి గెలిచి
 భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రానికి చెందిన సార సరస్వతి మూడుసార్లు స్థానిక ఎన్నికల్లో ఓడిపోయి మూడవ సారి ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ అయ్యింది. టెన్త్ వరకు చదువుకున్న సరస్వతి సాధారణ గృహిణి. భర్త సార బాలయ్య రిైటె ర్డ్ ఆర్టీసీ ఉద్యోగి. మొదటి సారిగా 2001లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోచంపల్లి-3 ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయింది. 2006లో జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకుంది. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి ఓడింది. తిరిగి ఇటీవల జరిగిన మండల ప్రాదేశిక ఎన్నికలలో పోచంపల్లి-4 ఎంపీటీసీ పోటీ చేసి గెలిచింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా గెలవడానికి మెజార్టీ లేకున్నా మారిన రాజకీయ సమీకరణాలు ఆమెకు ఉపకరించాయి. టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో ఎంపీపీగా నిలిచింది.
 
 భర్త ప్రోత్సాహంతో..
 పెద్ద అడిశర్లపల్లి :  పీఏపల్లి మండల పరిషత్ పీఠాన్ని అధిరోహించిన మేడారం రాజమ్మ ఏడోతరగతి మాత్రమే చదువుకుంది. అందరి మాదిరిగానే సాధారణ గృహిణి.  రాజమ్మ భర్త నారాయణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య కార్యకర్త. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మేడారం గ్రామ ఎంపీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో భర్త ప్రోత్సాహంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందింది. ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు అయిన నేపథ్యంలో అధ్యక్షత స్థానం కోసం పార్టీ నుంచే ముగ్గురు పోటీకి వచ్చినా రాజమ్మకే ఎంపీపీ పీఠం వరించింది.
 
 మొదటిసారిగా రాజకీయాల్లోకి..
 హాలియా : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన వస్త్రపురి మల్లిక 26ఏళ్లకే పెద్దవూర ఎంపీపీ పదవి చేపట్టింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. భర్త  సాధారణ రైతు. మల్లిక కుటుంబంపై ఉన్న గౌరవంతో చింతలపాలెం-1 ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వుకావడం కూడా మల్లికకు కలిసివచ్చింది. ఏకగ్రీవంగా ఎంపికైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎంపీపీ పదవి చేపట్టింది. ప్రజలందరి సహకారంతో ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యా.. వారి రుణం తీర్చుకోవడం కోసం కృషి చేస్తానని పేర్కొంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement