
పోరుబాట వీడిన మావోయిస్టు దంపతులు
- రూరల్ ఎస్పీ ఎదుట లొంగుబాటు
- ఎన్నికల సమయంలో హింసకు విఫలయత్నం
- లొంగిపోయినవారిలో ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి రాజు
వరంగల్ క్రైం : దశాబ్దకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసిన మావోయిస్టు దంపతులు పోరుబాట వీడారు. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు ఎదుట శుక్రవారం లొంగిపోయూరు. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి లొంగుబాటు వివరాలను రూరల్ ఎస్పీ వెల్లడించారు. భూపాలపల్లి మండలం అజాంనగర్‌కు చెందిన మేకల రాజు అలియాస్ రాజ్‌కుమార్ అలియాస్ మురళి ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మద్దేడు తాలూకా చెలాంనెంద్రాకు చెందిన మిడియం సోమిడి అలి యాస్ సంగీత ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా దళ సభ్యురాలిగా పనిచేస్తోంది. దంపతులైన వీరిద్దరు పార్టీలో పనిచేస్తున్న క్రమంలోనే వివాహం చేసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక, ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా సంచలనాలకు పాల్పడేందుకు విఫలయత్నం చేశారు.
అజాంనగర్ నుంచి అజ్ఞాతంలోకి..
అజాంనగర్‌కు చెందిన మేకల రాజు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. భూపాలపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత తన గ్రామంలో మావోయిస్టు పార్టీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై 2003లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మొదట మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ దళ సభ్యుడిగా, 2005లో జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న ప్రొటెక్షన్ టీమ్‌లో గార్డుగా బాధ్యతలు నిర్వహించాడు.
2009లో ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, 2011లో వాజేడు ఏరియా ఎల్‌ఓఎస్ కమాండర్‌గా బాధ్యత లు నిర్వహించిన అనంతరం 2012 జూన్ నుంచి ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఇతడి సారథ్యంలో అనిల్, కృష్ణ, మహేష్, రంజిత్ కలిసి బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులను హతమార్చి సంచలనం సృష్టించాలని యత్నించారు. అలాగే భద్రు సారథ్యంలో కొత్తగూడ ఏరియాలో సంఘటనలకు పాల్పడి సంచలనం సృష్టించాలనుకున్నా రు. కానీ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో వెనుదిరిగారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన మిడియం సోమిడి
సోమిడి నిరుపేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న క్రమంలో మద్దెడు ఏరియా కమిటీ కమాండర్ నగేష్ నిర్వహించే విప్లవ సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితురాలై 2003లో అజ్ఞాతంలోకి వెళ్లింది. మద్దేడు ఏరియా కమిటీ దళంలో పనిచేసి 2006లో మచ్చ సొమయ్య అలియాస్ సురేందర్ అలియూస్ సతీష్ ప్రొటెక్షన్ టీమ్ సభ్యురాలిగా పనిచేసింది. అనంతరం ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా దళసభ్యురాలిగా పనిచేసింది. 2011లో ఇదే ఏరియా కమిటీ సభ్యురాలిగా ప్రమోట్ అయింది.
మేకల రాజుపై పలు కేసులు..
2009లో పోలీసులకు, మావోయిస్టు దళానికి జరిగిన ఎదురు కాల్పుల ఘటన.
2009లో బోర్లగూడెం వద్ద ముగ్గురు వ్యక్తులను ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చిచంపిన కేసు. ఏటూరునాగారంలో రమేశ్, బుట్టాయిగూడెంలో మధుక ర్ హత్య కేసులు.
2012లో సుకుమా జిల్లా మిన్నప్ప వద్ద సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడి చేసి ఏడుగురు జవాన్లను హతమార్చిన కేసు.
తాళ్లగూడెం వద్ద జగదీష్, శ్రీను, రాజును, దుద్దెడ వద్ద శివయ్య, రామయ్యను, అన్నారం వద్ద కురుసం రోశయ్యను కాల్చి చంపిన కేసుల్లో నిందితుడు.
దేవాదుల వద్ద ప్రాజెక్టుకు సంబంధించిన సా మగ్రిని పాక్షికంగా ధ్వంసం చేసిన సంఘటన.
బోర్లగూడెం, అజాంనగర్ వద్ద బస్సులను, లారీని దగ్ధం చేసిన సంఘటనలో నిందితుడు.
రాజుపై రూ.4 లక్షల రివార్డు ఉంది.