దుమ్ముగూడెం(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని కుంట బ్లాక్ పరిధి ధర్మపేట బేస్‌క్యాంపు వద్ద మావోయిస్టులు శుక్రవారం పోలీసులపై దాడి చేసే యత్నంలో ప్రెషర్ బాంబును పేల్చడంతో పాటు, కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఓ జవాన్ అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు దండకారణ్యంలో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం ధర్మపేట బేస్‌క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ బేస్‌క్యాంపు సమీపంలో ఉన్న వాగు వద్ద నెలరోజులుగా పోలీసులు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణాన్ని మావోయిస్టులు వ్యతిరేకించడంతో పాటు పనులను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రెషర్ బాంబులు, మందుపాతరలు, భూమి టాప్స్ అమర్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో వాగువద్ద మాటు వేసిన మావోయిస్టులు అటుగా వస్తున్న పోలీసులను గమనించి ప్రెషర్ బాంబు పేల్చారు. పోలీసులు తేరుకునే లోపే మావోయిస్టులు వారిపై కాల్పులు కూడా జరపడంతో అజయ్‌కాక(35) అనే ఆర్మ్‌డ్ కానిస్టేబుల్ చనిపోయాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని హెలీకాఫ్టర్‌లో జగ్దల్‌పూర్ తరలించారు. ఈ ఘటనతో బేస్‌క్యాంపు దగ్గరగా ఉన్న జిల్లాలోని దుమ్ముగూడెం మండలం వద్ద పోలీసులు అలర్ట్ అయ్యారు. కూంబింగ్ చేపట్టారు.