ఆర్మూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణంగా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ విమర్శించారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు రంగుల ప్రపంచం చూపించి, మాయ మాటలు చెప్పాడని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతున్నాడని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో విద్యుత్ కోతలతో పంట పొలాలు బీళ్లు వారుతూ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండే పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హఠాన్మరణాలకు గురవుతున్నారన్నారు. దీంతో గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో విషాద ఛాయలే ఉన్నాయన్నారు.
టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. ఆరు నెలల టీఆర్‌ఎస్ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, పింఛన్ దారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అంశాలపై విచారణ జరపడానికి నియమించిన త్రిసభ్య కమిటీ అతీ గతీ లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
9న అంకాపూర్‌లో వేడుకలు..
ఈ నెల 9న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినంతో పాటు అదే రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
గ్రామాల్లో విషాద ఛాయలకు సర్కారే కారణం!
Published Sun, Dec 7 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement