‘జనరిక్’ మందు.. జేబులు నిండు
సంగారెడ్డి క్రైం: మందుల వ్యాపారమంతా ‘జన రిక్’ మయంగా మారింది. బ్రాండెడ్ మందుల కొనుగోలు పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారడంతో వివిధ మందుల కంపెనీలు అదే ఫార్మూలాతో అతి తక్కువ ధరకు ‘జనరిక్’ పేరుతో మందులను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి.
అయితే జనరిక్ మందులను భారీగా కొనుగోలు చేస్తున్న మెడికల్ దుకాణాల యజమానులు రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వకుండా బ్రాండెడ్ ధరకే జనరిక్ మందులను విక్రయించేస్తున్నారు. లాభాలు కూడా బాగా వస్తుండడంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జనరిక్ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది.
పేరుమారినా రేటు మారదు
దాదాపు ఫార్మ కంపెనీలన్నీ బ్రాండెడ్ (ఎథికల్) మందులతో పాటు జనరిక్ మందులను తయారు చేసి మార్కెట్‌లోకి పంపుతున్నాయి. ఎథికల్ మందులు బ్రాండెడ్ పేరుతో ఉండగా, అదే ఫార్మూలాతో తయా రై చిన్నపాటి పేరు మార్పిడితో జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చాయి.
బ్రాండెడ్ మందుల విక్రయాలపై మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులకు పెద్దగా లాభాలు ఉండకపోవడంతో, వారంతా ఎక్కువగా జనరిక్ మందుల విక్రయంపైనే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జనరిక్ మందులపై ఉన్నఎంఆర్‌పీకి, మెడికల్ వ్యాపారులకు లభించే ధరకు భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటోంది. ఎంఆర్‌పీలో అత్యధిక శాతం డిస్కౌంట్‌ను వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ డిస్కౌంట్‌ను ఏ ఒక్క దుకాణ దారుడు కూడా వినియోగదారులకు ఇవ్వడం లేదు.
బాండెడ్ మందుల ధరలతో సమానంగా ఈ మందులను కూడా విక్రయిస్తున్నారు. జనరిక్ మందులు హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మెదక్ జిల్లాకు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. జనరిక్ మందుల ప్యాకెట్లు ఒకటి కొంటే మరొకటి అదనం వంటి ఆఫర్లను సైతం ఆయా కంపెనీలు అందిస్తుంటాయి. అంతేగాక ఎక్కువగా అమ్మకాలు జరిపే మెడికల్ ఏజెన్సీల వారికి విదేశీ ప్రయాణ సౌకర్యం సైతం ఆయా కంపెనీలు కల్పిస్తుంటాయి. దీంతో మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు...మెడికల్ షాప్‌లకు ఎక్కువగా ఈ మందులనే అంటగడుతున్నారు. దీంతో మెడికల్ షాపు యజమానులు కూడా జనరిక్ మందులను బ్రాండెడ్ మందుల ధరకు రోగులకు విక్రయిస్తున్నారు.
జనరిక్ మందుల గురించి తెలిసిన వారెవరైనా ప్రశ్నిస్తే మాత్రం డిస్కౌంట్ ఇస్తారు...లేకపోతే అసలు ధరకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే జనరిక్ మందులపై ఉన్న ఎంఆర్‌పీ, ఏజెన్సీలకు అందుతున్న ధర మధ్య తేడాను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ సవరణ సైతం తెచ్చింది. వెంటనే మందుల ధరలు తగ్గించడంతోపాటు ఆ ధరను ఆ మందులపై ముద్రించాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఎంఆర్‌పీ కొంత వరకు తగ్గినప్పటి కీ, వ్యత్యాసం ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది.
శాంపిల్స్ సైతం విక్రయాలు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నిరక్షరాస్యతను కొందరు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ కంపెనీల ద్వారా డాక్టర్లకు మాత్రమే అందుతున్న శాంపిల్స్‌ను సైతం విక్రయిస్తున్నారు. ఈ మందులను డాక్టర్లు మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉచితంగా అందజేయాల్సి ఉంటుంది. కానీ మెడికల్ దుకాణాల్లో సైతం ఈ శాంపిల్స్ విరివిగా లభ్యమవుతున్నాయి.
అసలు మందులేవో? ఫిజీషియన్ శాంపిల్స్ ఏవో? తెలియని గ్రామీణులు నిలువునా మోసపోతున్నారు. లాభార్జనే ధ్యేయంగా మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకున్న కొందరు వ్యక్తులు ఇతరుల బి.ఫార్మాసీ, డి.ఫార్మాసీ ధ్రువపత్రాలను అద్దెకు తెచ్చుకొని దుకాణాలను నడుపుతున్నారు. రోగులకు ఇచ్చే మందులు ఏమైనా ముప్పు తె చ్చిపెడితే తమకేం నష్టం లేదుగా అన్న ధీమాతో వ్యాపారం చేస్తున్నారు. విడిగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల్లోనూ ఫార్మాసిస్టు లేకపోగా కనీసం ఇంటర్ ఉత్తీర్ణత పొందిన వారు సైతం కరువయ్యారు.