జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల | medical college to district | Sakshi
Sakshi News home page

జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల

Published Sun, Aug 10 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల

జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల

ఖమ్మం వైరారోడ్: జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక మామిళ్లగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ పది పడకల ఆస్పత్రిని ఆయన శనివారం ప్రారంభించారు. ఆయుర్వేదిక్ వైద్యశాల మీటింగ్ హాల్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు.

సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, అక్కడి గిరిజనుల్లో వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

  తెలంగాణలో జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తొలిదశలో కరీంనగర్‌తో పాటు జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 19న జరిగే సోషల్ ఎకనామిక్ సర్వేకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకే సర్వేలు చేపడుతున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీల బలోపేతానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

అంటువ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. డాక్టర్‌ల సమస్యలేంటో తనకు తెలుసునని, సీనియారిటీ ఉన్నా వేతనం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లు రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవా దృక్పథంతో ముందుకు పోవాలని కోరారు. ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.


  మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, డయేరియా తదితర వ్యాధుల నివారణకు ముందస్తుగా మందులు పంపిణీ చేస్తున్న ఆయుర్వేదిక్ వైద్యులు, మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్‌ను అభినందించారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, కేంద్రం నుంచి రావాల్సిన ఇతర నిధులను తెప్పించి వైద్యసేవల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంగన్‌వాడీ సెంటర్లకు డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధి నివారణ మెడికల్ కిట్‌లను అందజేశారు.

  ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు 1982లో తాను ఖమ్మం ఆస్పత్రికి వచ్చానని, నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు సేవలందించాలని కోరారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవాదృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. సిబ్బంది కొరత, ఇతర సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరించుకోవాలన్నారు.

పీహెచ్‌సీలను బలోపేతం చేసి అక్కడ ఆరోగ్యశ్రీ సేవలను తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, డీఎంహెచ్‌వో భానుప్రకాష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణరావు, డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఆర్‌ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్‌డీడీ విజయ్‌కుమార్, ఆయుష్ ఏడీ రాజేందర్‌రెడ్డి, ఆయుర్వేదిక్ వైద్యశాల సీనియర్ డాక్టర్ లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement