తల్లిదండ్రులకు అప్పగిస్తున్న అన్నం శ్రీనివాసరావు
ఖమ్మంఅర్బన్ : నగరంలోని ప్రశాంతినగర్‌లోని అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని 6 నెలల తర్వాత కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. అతడి ఆరోగ్యం కుదుట పడటంతో చిరునామా తెలిపాడు. దీంతో అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐలు బాగం మోహన్‌రావు, అశోక్‌రెడ్డిల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల కిందట పచ్చిమగోదావరి జిల్లా (ఐ) పంగిడి మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన ఎంఎల్ సుబ్రహ్మణ్యం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
కొంతకాలం కిందట ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో రోడ్డుపై తిరుగుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నం ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు తీసుకొచ్చి తన ఆశ్రమంలో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో అతడి ఆరోగ్యం కుదుట పడింది. అనంతరం తన కుటుంబ వివరాలు, గ్రామం పేరు.. ఇతర వివరాలన్నీ చెప్పడంతో వారికి సమాచారం అందించారు. దీంతో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు శ్రీరాములు, కృష్ణకుమారి రావడంతో పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. మంచి మనిషిగా తీర్చిదిద్దిన ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment