
సాక్షి, హైదరాబాద్: ఓ దార్శనికుడి ఆలోచన.. సుమధుర స్వప్నం.. నేడు సాకారం కాబోతోంది! నాడు ముందుచూపుతో వేసిన ఒక్క అడుగు నేడు భాగ్యనగరంలో మెట్రో శకానికి నాంది పలకబోతోంది. లక్షలాది మందికి ప్రయాణ అవస్థలను దూరం చేయనుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి నగరవాసులకు విముక్తి కల్పించడం.. నగర పునర్నిర్మాణం.. పెట్టుబడుల ప్రవాహం.. ఉపాధి కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో మెట్రో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడని రీతిలో పూర్తిగా పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచంలో పీపీపీ విధానంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే ఇదే కావడం గమనార్హం.
వైఎస్సార్ ముద్ర ఇదీ..
నాటి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు 2005–07 మధ్య పలుమార్లు ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ.), జేబీఎస్–ఫలక్‌నుమా (15 కి.మీ.), నాగోల్–రాయదుర్గం(29 కి.మీ.) మొత్తంగా మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో విస్తృతంగా పర్యటించారు. మెట్రో ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. మెట్రో నిర్మాణానికి వీలుగా వైఎస్సార్ 2007 మే 14న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను ప్రారంభించారు. మెట్రో నిర్మాణానికి వీలుగా నాటి రాష్ట్ర ప్రభుత్వం 2008 సెప్టెంబర్ 19న మేటాస్‌తో నిర్మాణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ కార్పొరేట్ స్కామ్‌లో చిక్కుకోవడంతో పారదర్శకంగా టెండర్లను రద్దు చేస్తూ 2009 జూలై 14న జీవో జారీ చేసింది. తిరిగి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించడంతో ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చింది.
ఈ సంస్థకు 2010 సెప్టెంబర్ 4న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టుకు చేసే వ్యయంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం రూ.2 వేల కోట్లు, ఆస్తుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు, నిర్మాణ సంస్థ రూ.12 వేల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ ప్రాజెక్టుకు చేసే వ్యయాన్ని 45 ఏళ్ల కాలంలో మెట్రో కారిడార్లలో ప్రభుత్వం కేటాయించిన 269 ఎకరాల విలువైన స్థలాల్లో రియల్టీ, రవాణా రంగ ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి, మాల్స్ ఏర్పాటు, ప్రయాణికుల చార్జీల ద్వారా సమకూర్చుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మెట్రో తొలి పిల్లర్‌ను 2012 నవంబర్ 25న ఉప్పల్ జెన్‌ప్యాక్ట్ వద్ద ఏర్పాటు చేశారు. మంగళవారం నాగోల్– అమీర్‌పేట్(17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్(17కి.మీ.) మార్గంలో మొత్తంగా 30 కి.మీ. మార్గంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.