'కార్మికులంటే గౌరవమే.. కక్షసాధింపు కాదు'
నిజామాబాద్: 'ఆర్‌టీసీ నష్టాల్లో ఉందని, గట్టెక్కేదాక ఆగితే అడిగినంత ఇస్తామని చెప్పాం. అయినా కార్మికులు సమ్మెకు దిగారు' అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి సమీపంలోని నర్సన్నపల్లి వద్ద రవాణా శాఖ కార్యాలయాన్నిగురువారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్‌టీసీ కార్మికులు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని, వారంటే తమకెంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్మికులపై కక్షసాధింపు చర్యలు లేవని, ఇప్పటికీ వారిని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. కేబినెట్ సబ్‌కమిటీని సీఎం కేసీఆర్ నియమించారని, నివేదిక అందిన తరువాత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నష్టాల్లో ఉన్నందునే కార్మికులను సమ్మెకు పోవద్దని కోరామని మంత్రి పట్నం చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాల దారులు ఎక్కువ డబ్బులు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
(కామారెడ్డి)